ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు సినిమా కష్టాలకు తెరపడనుంది. చిరంజీవి నేతృత్వంలోని సినీ పెద్దల బృందం ఇటీవల ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలసిన విషయం తెలిసిందే. ఈ భేటీలో సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న కష్టాలు, పరిశ్రమ చేయాల్సిన సాయం, ఇవ్వాల్సిన రాయితీలు… ఇలా చాలా విషయాలు చర్చకు వచ్చాయి. ఈ క్రమంలో అసలైన టికెట్ రేట్ల విషయం కూడా చర్చకొచ్చింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని సమాచారం వచ్చింది. అయితే కొత్త టికెట్ రేట్లు ఇవీ అంటూ… కొన్ని వివరాలు బయటికొచ్చాయి.
రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో నాన్ ప్రీమియం సీట్లు 25 శాతం వరకు ఉండాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించిందని సమాచారం. మల్టీప్లెక్సుల విషయంలో నాన్ ప్రీమియం సీట్లపై ఇప్పటివరకు స్పష్టత లేదు. మరి ఆ థియేటర్లలో నాన్ ప్రీమియం సీట్లు ఉంచడం సాధ్యమైనా అనేది తేలాల్సి ఉంది. చిన్న సినిమాల విడుదలకు థియేటర్లు దొరకడం లేదన్న చర్చ కూడా భేటీలో జరిగింది. ఈ సమస్యను పరిష్కరించే బాధ్యతను చిరంజీవి, రాజమౌళికి సీఎం జగన్ అప్పగించినట్లు సమాచారం.
గతంలో విడుదల చేసిన సినిమా టికెట్ల ధరల జీవోలో ప్రతి కేటగిరీలో మూడు తరగతులు పెట్టారు. ఎకానమీ, డీలక్స్, ప్రీమియంగా తరగతులను విభజించారు. తాజాగా వాటిలో కొన్ని మార్పులు చేశారు. అయితే వాటి అమలు విధానం తదితర అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. కొత్త ధరలు దిగువ విధంగా ఉండొచ్చు అని సమాచారం…
* మున్సిపల్ కార్పొరేషన్లలో మల్టీప్లెక్స్ టికెట్ ధర ₹150, మున్సిపాలిటీలో ₹125, నగర పంచాయతీలో ₹100గా నిర్ణయించారు. రిక్లయినర్ సీట్ల విషయానికొస్తే ₹250 గా నిర్ణయించారు.
* కార్పొరేషన్లలో ఏసీ థియేటర్లు కనిష్టం రూ. 70, గరిష్ఠం రూ. 100గా నిర్ణయించారు. అదే మున్సిపాలిటీ అయితే ఈ ధరలు రూ. 60, రూ. 80గా ఉన్నాయి. నగరపంచాయతీలో రూ. 50, రూ.70గా ఉన్నాయి.
* ఏసీ లేని థియేటర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఉంటే కనిష్ఠ ధర రూ.40, గరిష్ట ధర రూ.60గా ఉంటుంది. మున్సిపాలిటీ అయితే ఈ ధరలు వరుసగా రూ. 30, రూ. 50, నగర పంచాయతీలు అయితే రూ.20, రూ.40గా నిర్ణయించారట.