ఇంటర్వ్యూలు ఇస్తామని, మీతో మాట్లాడతాం అని మీడియాను పిలుస్తుంటే కొంతమంది అర్థం పర్థం లేని పిచ్చి ప్రశ్నలు అడుగుతున్నారు. ఇలాంటివి వద్దు అని అందరూ అంటున్నారు అని మొన్నీమధ్యే టాలీవుడ్‌లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మనం కూడా దీని వల్ల వస్తున్న ఇబ్బందుల గురించి ఓ స్టోరీలో మాట్లాడుకున్నాం. అయితే వీటికి సినిమా టీమ్స్ తమవైపు నుండి ఓ పరిష్కారాన్ని ఎంచుకుంది. అదే ఎడిట్ అండ్ సెండ్. అంటే సొంత ఇంటర్వ్యుల్లాగే ప్రెస్ మీట్లను, క్యూ అండ్ ఏ సెషన్లను కూడా ఎడిట్ చేసి మీడియాకు పంపిస్తున్నారు.
ప్రెస్ మీట్‌లు, క్యూ అండ్ ఏ సెషన్లు అంటే మీడియా అందరూ ఉండగా జరుగుతాయి. వాటిని కొన్ని టీవీ ఛానళ్లు, యూట్యూబ్ ఛానళ్లు లైవ్ స్ట్రీమింగ్ చేస్తాయి. అయితే రీసెంట్‌గా ఒకట్రెండు ఇంటర్వ్యూలు రికార్డెడ్ వస్తున్నాయి. ఏంటా అని చూస్తే ‘మీరేమైనా అడగండి.. మాకు నచ్చినవే ఉంచుతాం.. ఎందుకంటే వాటని మేమేం రికార్డు చేస్తాం’ అని అంటున్నాయి. రీసెంట్‌గా జరిగిన ఇద్దరు హీరోయిన్ల ఇంటర్వ్యూ ప్రెస్‌మీట్లు ఇలానే జరిగాయి. దీంతో టాలీవుడ్‌లో ఇదో ట్రెండ్ అంటున్నారు.

వ్యక్తిగత విషయాలను ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లలో అడగొద్దు అని కొంతమంది హీరోయిన్లు ముందుగానే చెబుతుంటారు. మీడియా పర్సన్స్ కూడా వాటికి తగ్గట్టుగా ఆచితూచి ప్రశ్నలు వేస్తుంటారు. అయితే ఒకరిద్దరు ఆ రూల్ మాకు లేదులే అని టంగ్ స్లిప్ అవుతుంటారు. వీటిని అరికట్టడానికి సినిమా పీఆర్ టీమ్‌లు, చిత్రబృందాలు.. మీరు ప్రశ్నలు అడిగేసి, సమాధానాలు వినేసి వెళ్లిపోండి.. మేం మరోసారి చూసుకొని మాకు ఓకే అనుకున్న ప్రశ్నలను ఉంచుతాం అని రికార్డెడ్ ప్రెస్ మీట్ల ఫుటేజ్ రిలీజ్ చేస్తున్నారు.
అయితే, ఇలాంటి హీరోయిన్లు బాలీవుడ్ మీడియా ముందుకు వెళ్లినప్పుడో, ఎవరో యూట్యూబర్ దగ్గరకు ఇంటర్వ్యూకి వెళ్లినప్పుడు కాంట్రవర్శీ విషయాలు చాలానే మాట్లాడుతున్నారు. మరి తెలుగు మీడియా ముందు చెప్పడానికి ఏంటో ఇబ్బంది.
