బాలీవుడ్‌లో ఏటా ఇచ్చే పురస్కారాల్లో ప్రతిష్ఠాత్మక ‘దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (DPIFF) 2024 పురస్కారాల ప్రదానోత్సవం ఇటీవల ఘనంగా జరిగింది. మంగళవారం రాత్రి ముంబయిలో నిర్వహించిన ఈ వేడుకకు పలువురు సినీ తారలు విచ్చేసి సందడి చేశారు. ఈ క్రమంలో ‘జవాన్’, ‘యానిమల్’ సినిమాలు ప్రముఖ పురస్కారాలను అందుకున్నాయి. హీరోహీరోయిన్ పురస్కారాలు ఆ సినిమాకు రాగా, దర్శకుడు మాత్రం వేరే సినిమాకు వచ్చింది. అయితే ఆ మూడూ సౌత్ సినిమా టచ్ ఉన్నవి కావడం గమనార్హం.
గతేడాది డిసెంబర్‌లో విడుదలై బాక్సాఫీసు దగ్గర బ్లాక్‌బస్టర్ విజయం అందుకున్న ‘యానిమల్’ చిత్రానికి గాను ఉత్తమ దర్శకుడిగా సందీప్ వంగా ఉత్తమ దర్శకుడిగా నిలిచారు. ఇక అట్లీ దర్శకత్వంలో రూపొందిన ‘జవాన్’ సినిమాలో నటనకుగాను షారుఖ్ ఖాన్ ఉత్తమ నటుడిగా పురస్కారం అందుకున్నారు. అదే సినిమాలో హీరోయిన్‌గా నటించిన నయనతార ఉత్తమ నటిగా పురస్కారానికి ఎంపికయ్యారు. అలాగే ‘మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే’ సినిమాకుగాను రాణీ ముఖర్జీ కూడా ఉత్తమ నటి అవార్డు ఉంది.
ఇతర (Dadasaheb Phalke) పురస్కారాల సంగతి చూస్తే.. ఉత్తమ నటుడు (నెగెటివ్ రోల్)లో బాబీ డియోల్ (యానిమల్) నిలవగా, ఉత్తమ నటుడు (క్రిటిక్స్)గా ‘సామ్ బహదూర్’ సినిమాకుగాను విక్కీ కౌశల్ నిలిచాడు. అనిరుధ్ రవిచందర్‌కు ఉత్తమ సంగీత దర్శకుడి పురస్కారం దక్కింది. ‘డంకీ’ సినిమాలోని ‘నిక్లే ది కభి హమ్ ఘర్‌సే ధున్కీ..’ పాటకుగాను ఉత్తమ గీత రచయితగా జావేద్ అక్తర్ పురస్కారం అందుకున్నారు.
ఉత్తమ గాయకుడిగా ‘జరహట్కే జర బచ్కే’ సినిమాలోని ‘తేరే వాసతే..’ పాట పాడిన వరుణ్ జైన్ నిలిచాడు. ‘పఠాన్’ సినిమాలోని ‘బేషరమ్ రంగ్..’ పాట పాడిన శిల్పా రావు ఉత్తమ గాయని పురస్కారం అందుకున్నారు. ఇక చిత్ర పరిశ్రమ అందించిన విశేష సేవలకుగాను ప్రముఖ నటి మౌషమీ ఛటర్జీకి అవుట్ స్టాండింగ్ కంట్రిబ్యూషన్ పురస్కారం అందించారు. ఇక సంగీత రంగానికి చేసిన సేవలకుగాను ఇదే పురస్కారాన్ని కేజే ఎసుదాసు అందుకున్నారు.