తెలుగుతో పాటు ఇతర భాషల్లో ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోలుగా గుర్తింపు వస్తుందని చరణ్, తారక్ నమ్ముతున్నారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో ఈ హీరోలు డబ్బింగ్ చెప్పుకున్నారు. అయితే మలయాళంలో మాత్రం ఆర్ఆర్ఆర్ సినిమాకు డబ్బింగ్ చెప్పుకోలేదని తారక్ వెల్లడించడం గమనార్హం. మలయాళం వర్కౌట్ కాలేదని డబ్బింగ్ చెప్పడానికి ప్రయత్నిస్తే రాజమౌళికి తమ డబ్బింగ్ భాషను కూనీ చేస్తున్నట్లు అనిపించిందని తారక్ వెల్లడించారు.
ఆ రీజన్ వల్లే మలయాళంలో డబ్బింగ్ విషయంలో డ్రాప్ అయ్యామని ఎన్టీఆర్ పేర్కొన్నారు. అయితే ఇతర భాషలకు డబ్బింగ్ చెప్పే సమయంలో మాత్రం ఎలాంటి ఇబ్బంది ఎదురు కాలేదని ఎన్టీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ లో పుట్టి పెరగడంతో హిందీ సులభంగా మాట్లాడగలమని తమిళ, కన్నడ భాషలపై కూడా తమకు అవగాహన ఉందని ఆ ధైర్యం వల్లే సులభంగా డబ్బింగ్ చెప్పగలిగామని ఎన్టీఆర్ వెల్లడించారు.
ఇతర భాషలలో డబ్బింగ్ చెప్పే సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని తారక్ అన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ కావడానికి నాలుగు వారాల సమయం ఉండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఎన్టీఆర్ కు జోడీగా ఈ సినిమాలో హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా మోరిస్ నటించగా చరణ్ కు జోడీగా అలియా భట్ నటించారు. అజయ్ దేవగణ్, శ్రియ, సముద్రఖని ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.
10,000కు పైగా రికార్డు స్థాయిలో థియేటర్లలో ఆర్ఆర్ఆర్ రిలీజ్ కానుండగా ఈ సినిమా విడుదలైన ఐదు రోజులకే భీమ్లా నాయక్ రిలీజ్ కానుంది. మరోవైపు మరో సినిమా రాధేశ్యామ్ కూడా సంక్రాంతికి షెడ్యూల్ అయింది. సంక్రాంతికి మూడు పెద్ద సినిమాల మధ్య పోటీ దాదాపుగా ఫిక్స్ అయినట్టేనని చెప్పవచ్చు. కలెక్షన్లపరంగా ఆర్ఆర్ఆర్ పై చేయి సాధించే ఛాన్స్ ఉండగా రాధేశ్యామ్, భీమ్లా నాయక్ ఏ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తాయో చూడాల్సి ఉంది. ఈ మూడు సినిమాల బడ్జెట్లు ఏకంగా 1,000 కోట్ల రూపాయలు కావడం గమనార్హం.