పేరుతోనే సినిమా మీద ఆసక్తి పెంచేయడం ఎలా? ఈ ప్రశ్నకు ఇప్పటికిప్పుడు సమాధానం తెలియాలంటే ప్రస్తుతం రిలీజ్‌కి రెడీ అవుతున్న ‘ఓం భీమ్ బుష్’ (Om Bheem Bush) సినిమా గురించి చదవాల్సిందే. #OBB అనే హ్యాష్ ట్యాగ్ పెట్టి క్యూరియాసిటీ పెంచిన టీమ్ సినిమా పేరు ‘ఓం భీమ్ బుష్’ అని పెట్టింది. దీంతో ఇదేంటో కొత్తగా ఉందే అని అందరూ ఈ సినిమా గురించి వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా విడుదల సందర్భంగా దర్శకుడు (Sree Harsha Konuganti) శ్రీహర్ష కొనుగంటి మీడియాతో మాట్లాడుతూ సినిమాలోకి ఆసక్తికర విషయం, అలాగే ఈ పేరు పెట్టడానికి కారణం కూడా చెప్పేశారు.
మామూలుగా అయితే ఎవరూ అనుకోనిది జరుగుతుందని చెప్పడానికి మనం ‘ఓం భీమ్ బుష్’ అని అంటుంటాం. చిన్న పిల్లలు సరదాగా ఆ మాట వాడుతుంటారు. అలాంటి ఫీలింగ్ ఈ సినిమా టైటిల్‌తో ఇవ్వాలని, సినిమాలో ఉన్న కీలక విషయాన్ని చెప్పాలని ఆ పేరు పెట్టాం అని శ్రీహర్ష చెప్పారు. మరి నో లాజిక్ అని ఎందుకు పెట్టారు అంటే… ఈ సినిమా లాజిక్స్‌తో ముడిపడిన కథే అని, అయితే భారతీయ తెరపై ఇప్పటివరకూ రాని కథ ఇందులో ఉంది అంటున్నారు. ఏ భాషలో చూసినా నచ్చుతుందని చెప్పారాయన.
ఓ విశ్వవిద్యాలయంలో చదువుకున్న ముగ్గురు యువకులు గుప్త నిధుల కోసం ఓ గ్రామానికి వెళ్లినప్పుడు అక్కడ జరిగిన సంఘటనల చుట్టూ ఈ సినిమా కథ సాగుతుంది అని తెలిపారు. కొంతమంది పీహెచ్‌డీలు చేస్తూ చేస్తూ అలా విశ్వవిద్యాలయాల్లో ఉండిపోతుంటారు. ఉస్మానియా విశ్వ విద్యాలయంలో తాను అలాంటి చాలా వయసున్న పీహెచ్‌డీ విద్యార్థుల్ని చూశాని, అప్పుడే ఈ సినిమా కథ ఆలోచనలోకి వచ్చింది అని చెప్పారు శ్రీహర్ష.
విశ్వవిద్యాలయాల్లో ఏళ్ల తరబడి చదువుకుంటూ, నింపాదిగా మెలిగిన ఓ ముగ్గురు స్నేహితుల అనుకోని పరిస్థితుల్లో రోడ్డు మీదకు వస్తే… ఎలా ఉంటుందనే ఆలోచన నుండే ఈ కథ పుట్టిందని చెప్పారు. (Sree Vishnu) శ్రీవిష్ణు, (Rahul Ramakrishna) రాహుల్ రామకృష్ణ, (Priyadarshi) ప్రియదర్శిని దృష్టిలో ఉంచుకునే ఈ కథ రాసినట్లు చెప్పారు.