కరోనా కారణంగా దాదాపు రెండేళ్ల పాటు షూటింగ్స్ జరగలేదు.ఈ ఏడాది ఆరంభంలో కూడా థర్డ్ వేవ్ ఎఫెక్ట్ పడి షూటింగ్లు కొన్నాళ్ళు ఆగాయి. మార్చి నుండీ అంతా అనుకున్నట్టు జరగడం వల్ల.. పెద్ద సినిమాలు వరుసగా రిలీజ్ అయ్యాయి. అవి సాధించిన ఫలితాల వల్ల ఇండస్ట్రీకి కొత్త ఊపు ఇచ్చినట్టు అయ్యింది. అంతా బానే ఉంది కదా అనుకుంటున్న తరుణంలో ఇప్పుడు మరోసారి దెబ్బ పడినట్టు అయ్యింది. విషయం ఏంటి అంటే రేపటి నుండీ షూటింగులు బంద్ అట.
‘రేపటి నుండీ షూటింగ్స్ కు రామంటూ… సినీ కార్మికులు బంద్ కు పిలుపునివ్వడం జరిగింది. చాలా కాలం నుండి వారికి చెల్లించవలసిన బకాయిలు చెల్లించలేదని… సినీ కార్మికులు ఫెడరేషన్ పై గట్టిగా ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఫెడరేషన్ సభ్యులు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అందుకని సమ్మెకు పిలుపునివ్వాలని సినీ కార్మికులు భావిస్తున్నారు. తమకు ఇవ్వాల్సిన వేతనాలు ఇచ్చి.. అలాగే జీతాలు పెంచేవరకూ షూటింగుల్లో పాల్గొనబోమని సినీ కార్మికులు ఫెడరేషన్ కు లేఖ రాశారు.
బుధవారం నాడు ఫెడరేషన్ ని ముట్టడించాలనే నిర్ణయానికి కూడా వచ్చినట్టు తెలుస్తుంది. ఈ విషయం కాస్త ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఈ విషయమై కొంతమంది నిర్మాతలు చర్చలు జరుపుతున్నారు. కార్మికుల వేతనాలు పెంచడం అనేది… నిర్మాతల్ని సంప్రదించి, వాళ్ల అభిప్రాయాల్ని కూడా సేకరించి ఆ తర్వాత ఫైనల్ చేయాలి.
మరి కార్మికులు ఎంత డిమాండ్ చేస్తారో, ఫెడరేషన్ సభ్యులు ఎంత వరకు పెంచుతారో. నిర్మాతలు అందుకు సానుకూలంగా స్పందిస్తారో లేదో చూడాలి.ఇది కనుక ఎక్కువ రోజులు కొనసాగితే నిర్మాతలకే ఎక్కువ నష్టం. అలాగే వీళ్ళు కార్మికుల పాత బకాయిలు కూడా చెల్లించాల్సి ఉంది.