ఇంతకుముందు సినిమాలకు థియేట్రికల్ రైట్స్ తరువాత భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టేది శాటిలైట్ హక్కులే. కానీ కొన్నాళ్లుగా శాటిలైట్ రైట్స్ కి పోటీగా డిజిటల్ రైట్స్ ఆదాయం కూడా పెరిగింది. శాటిలైట్ హక్కులను మించి డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ఎక్కువ రేటు పలకడం మొదలైంది. ఈ మధ్య కాలంలో శాటిలైట్ హక్కుల విలువ మరింతగా పడిపోతూ వస్తోంది. ఇకపై కూడా శాటిలైట్ మార్కెట్ మరింత దెబ్బతినే పరిస్థితులు కనిపిస్తున్నాయి. థియేటర్లు మూత పడడంతో సినిమాలన్నీ కూడా ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి.
డిజిటల్ స్ట్రీమింగ్ హవా పెరిగిన తరువాత మార్కెట్ లో శాటిలైట్ హక్కుల డిమాండ్ తగ్గిపోయింది. లాక్ డౌన్ లో ఓటీటీల సబ్‌స్క్రిప్షన్లు పెరిగిపోయాయి. దాదాపు అందరి ఇళ్లలో ఓటీటీ సబ్‌స్క్రైబర్లు ఉంటున్నారు. కొత్త సినిమా ఓటీటీలో రిలీజ్ అయిందంటే.. ఫ్యామిలీ మొత్తం కూర్చొని సినిమా చూసేస్తున్నారు. అదే సినిమా తరువాత టీవీలో రిలీజ్ అవుతుంటే ఎవరూ పట్టించుకోవడం లేదు. దానికి ఉదాహరణగా ‘భానుమతి రామకృష్ణ’ సినిమా గురించి చెప్పుకోవచ్చు. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ‘ఆహా’లో రిలీజైన ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇదే సినిమాను టీవీలో రిలీజ్ చేస్తే దారుణమైన టీఆర్ఫీ వచ్చింది. ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది. ఈ లెక్కన చూస్తుంటే శాటిలైట్ మార్కెట్ ఎంతగా పడిపోతుందో అర్ధం చేసుకోవచ్చు. లాక్ డౌన్ పూర్తయిన తరువాత కూడా ఈ పరిస్థితి మెరుగుపడే ఛాన్స్ కనిపించడం లేదు. థియేటర్లలో సినిమాలు చూసే ప్రేక్షకులు ఆ తరువాత ఓటీటీ రిలీజ్ ఉంటుందని కాబట్టి చూడాలనుకుంటే ఓటీటీలో చూస్తారు. టీవీల్లో వచ్చేసరికి మెజారిటీ ఆడియన్స్ సినిమా చూసేసి ఉంటారు కాబట్టి టీఆర్ఫీ లతో పాటు శాటిలైట్ మార్కెట్ కూడా పడిపోవడం ఖాయమని తెలుస్తోంది.