సినిమా షూటింగ్‌లో భాగంగా కారుతో పల్టీ కొడుతూ ప్రముఖ స్టంట్ మ్యాన్ రాజు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆర్య, పా.రంజిత్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘వేట్టువం’ సినిమా షూటింగ్‌లో భాగంగానే ఇది జరిగింది. తమిళనాడులోని నాగపట్నం సమీపంలో కారుతో స్టంట్స్ చేస్తుండగా రాజు గుండెపోటుకు గురయ్యారు. అయితే ఈ ఘటన జరిగిన రెండు రోజులైనా చిత్ర దర్శకుడు పా.రంజిత్ స్పందించకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో ఆయన రియాక్ట్ అయ్యారు.
స్టంట్ మ్యాన్ రాజు మృతి పట్ల దర్శకుడు పా.రంజిత్, ఆయన నిర్మాణ సంస్థ విచారం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఓ భావోద్వేగ పోస్ట్‌ను షేర్ చేశారు. ప్రతిభావంతుడైన స్టంట్ ఆర్టిస్ట్, మాతో కలిసి సుదీర్ఘ ప్రయాణం చేస్తున్న సహచరుడు మోహన్ రాజ్‌ను జులై 13న కోల్పోయాం. ఆయన మరణ వార్త తెలియగానే మా హృదయం ముక్కలైంది. ఆయన భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులు, రాజు అన్నను ప్రేమించేవాళ్లకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం అని రాసుకొచ్చారు.
సినిమా షూటింగ్ రోజు పక్కా ప్రణాళికతోనే ప్రారంభించామని, అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకున్నామని ఆ పోస్టులో పేర్కొన్నారు. ఏ సన్నివేశం ఎలా తీయాలో స్పష్టంగా ప్లాన్ చేసుకున్నామని కూడా చెప్పారు. సినిమా షూటింగ్, యాక్షన్ సీన్స్ అనగానే అంతా మంచి జరగాలని ప్రార్థిస్తామని, ఆ రోజు షూటింగ్ జరిగేటప్పుడూ అలాగే చేశామని చెప్పారు. అయితే అనుకోని విధంగా మోహన్ రాజ్ కన్నుమూశారు. ఆ సంఘటన మమ్మల్ని షాక్‌కు గురిచేసింది అని ఆ పోస్ట్‌లో రాసుకొచ్చారు.
మోహన్ అన్న అంటే స్టంట్ టీమ్‌తో పాటు, మొత్తం సినిమా గౌరవిస్తుంది. స్టంట్స్ డిజైన్, ప్లానింగ్, అమలు ఇలా అన్నీ తెలిసిన వ్యక్తి ఆయన. స్టంట్ డైరెక్టర్ దిలీప్ సుబ్బరాయన్ అన్ని జాగ్రత్తలు తీసుకుని, రక్షణ చర్యలు తీసుకుని షాట్ మొదలు పెట్టారు.. కానీ మేము ఒక అసమాన ప్రతిభావంతుడైన వ్యక్తిని కోల్పోయాం. ఆయన ఎప్పటికీ మా జ్ఞాపకాల్లోనే ఉంటారు అని పా.రంజిత్, నిర్మాణ సంస్థ నీలమ్ ప్రొడక్షన్స్ విచారం వ్యక్తం చేశాయి.