అనుపమ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘పరదా’ సినిమా ఆగస్టు 22న రిలీజ్ అయ్యింది. ప్రవీణ్ కాండ్రేగుల ఈ చిత్రానికి దర్శకుడు. ‘సినిమా బండి’ ‘శుభం’ సినిమాలతో తన మార్క్ చాటుకున్నాడు ప్రవీణ్. కాబట్టి.. ‘పరదా’ పై ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఫోకస్ పడింది. అయితే కాన్ఫిడెన్స్ తో.. సినిమాకి ప్రీమియర్స్ వేశారు. తప్పులేదు. కానీ అదే టైంలో ఓ బోల్డ్ స్టేట్మెంట్ వదిలారు చిత్ర యూనిట్ సభ్యులు.
అదేంటి అంటే.. ‘మీరు రివ్యూలు చదివాకే సినిమాకి రండి’ అని ప్రమోషన్స్ టైంలో చెప్పుకొచ్చారు. కట్ చేస్తే సినిమాకి మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. మొదటి రోజే సినిమాకి 15 శాతం ఆక్యుపెన్సీలు కూడా నమోదు కాలేదు. చాలా ఏరియాల్లో షోలు కూడా క్యాన్సిల్ అయ్యాయి. వీకెండ్ లో మినిమమ్ ఓపెనింగ్స్ కూడా రాలేదు. సినిమా చూసిన వాళ్ళలో కూడా ఎక్కువ మంది మిక్స్డ్ టాకే చెబుతున్నారు.
సో చిత్ర బృందానికి కోపం వచ్చినట్లు ఉంది. ఈరోజు థాంక్యూ మీట్ అంటూ ఓ ప్రెస్ మీట్ పెట్టారు. ఇందులో దర్శకుడు ప్రవీణ్ ‘మనిషన్నాక తప్పులు చేస్తారు. కానీ తప్పులనే హైలెట్ చేసి మంచిని ఎందుకు చంపేస్తున్నారు’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. మరోపక్క అనుపమ ‘నా కెరీర్లో ఇది నా బెస్ట్ మూవీ. మేము ఏ తప్పు చేయలేదు. ఉమెన్ సెంట్రిక్ మూవీ చేస్తే ఇలాంటి రెస్పాన్సే వస్తుంది. కమర్షియల్ సినిమాల్లో ఎన్ని తప్పులు ఉన్నా క్షమించేస్తారు. కానీ ఇలాంటి ప్రయోగాత్మక సినిమాలను మాత్రం చంపేస్తారు’ అంటూ అనుపమ అగ్రెసివ్ కామెంట్స్ చేసింది.
అలాగే తమకు అనుకూలంగా రివ్యూలు ఇచ్చిన మీడియా హౌస్లను ఏకంగా నేషనల్ మీడియా అంటూ కొనియాడటం గమనార్హం. రివ్యూలను ఇంత పర్టిక్యులర్ గా తీసుకున్నప్పుడు.. రిలీజ్ కి ముందు ‘రివ్యూలు చదివే సినిమాకి రండి’ అని జనాలకు పిలుపునివ్వడం దేనికి? మిక్స్డ్ రివ్యూస్ వచ్చినప్పుడు వాటి వల్ల జనాలు థియేటర్ కు రావడం లేదు అని ఎమోషనల్ కామెంట్స్ చేయడం దేనికి? సినిమా ప్రమోషన్స్ లో మేకర్స్ ‘పలికే ప్రతి మాటకి ముందు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది?’ అనడానికి ఇదొక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కంటెంట్ బాగుంటే.. ఏ సినిమాని కూడా ఎవ్వరూ ఆపలేరు.