ప్రతి సినిమా వెనుక చాలా కష్టం ఉంటుంది. మొత్తం సినిమా అయ్యాక దానిని తెర మీద చూసుకుంటే భలే ఆనందంగా ఉంటుంది. ఫలితం మాట పక్కనపెడితే తమ కష్టం చూసి బృందం ఆనందంతో నిండిపోతుంది. అలాంటి సినిమా చూస్తే ప్రేక్షకులు ఎంత ఆనందపడతారో, సినిమా నిర్మాణం సమయంలో జరిగిన విషయాల్ని తెలుసుకుంటే అంతే ఆనందపడతారు. అందుకే మేకింగ్ సీన్స్ లాంటివి విడుదల చేస్తుంటారు. ఇప్పుడైతే మేకింగ్ సీన్స్, డిలీటెడ్ సీన్స్ ఉన్నాయి. మరి పాత రోజుల్లో లేవు. అందుకే అప్పటి జనాలు చెప్తే ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. అలా పరుచూరి గోపాలకృష్ణ తమ పాత సినిమా సంగతుల్ని అప్పుడప్పుడు చెబుతుంటారు. తాజాగా ‘లారీ డ్రైవర్’ విషయాల్ని చెప్పుకొచ్చారు.
బాలకృష్ణ – బి.గోపాల్ కాంబినేషన్‌లో 1990లో వచ్చిన చిత్రం ‘లారీ డ్రైవర్’. ఆ సినిమా ఇటీవల 30 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో పరుచూరి గోపాలకృష్ణ ఓ వీడియోలో మాట్లాడారు. ‘‘బాలయ్య బాబు ఎన్నో చిత్రాలకు బి.గోపాల్ దర్శకత్వం వహించారు. ఓసారి బి.గోపాల్‌కు రెండు కథలు చెప్పాం. ఒకటి ‘నిప్పురవ్వ’, మరొకటి ‘వంశానికొక్కడు’. కానీ, ఈ రెండూ జరగలేదు. వాటికి బదులు ‘లారీ డ్రైవర్’, ‘బొబ్బిలి సింహం’ చిత్రాలు వచ్చాయి. నిజానికి ‘లారీ డ్రైవర్’ సినిమాకు ముందు బి.గోపాల్‌కు ‘వంశానికొక్కడు’ కథ చెప్పాం. అది ఆయనకు నచ్చలేదు. దీంతో ఆంజనేయ పుష్పానంద్ ‘లారీ డ్రైవర్’ కథ వినిపించారు. అది నచ్చి తీశారు. ఆ తర్వాత కొన్నాళ్లకు 1996లో శరత్ దర్శకత్వంలో ‘వంశానికొక్కడు’ తెరకెక్కింది’’ అని గుర్తు చేసుకున్నారు పరుచూరి గోపాలకృష్ణ.
సినిమాలో బాబుమోహన్, శారద పాత్రల గురించి కూడా పరుచూరి చెప్పారు. ‘‘ముందుగా ఈ సినిమాలో బాబు మోహన్‌ను పెట్టుకోవాలనుకున్నాం. కానీ, ఈ కథలో ఆయనది చాలా చిన్న పాత్ర. అప్పటికే ఆయన అద్భుతమైన కమెడియన్. ఓ రోజు బాబు మోహన్ ఫోన్ చేసి ‘సర్, నేను రావాలా? వద్దా? నా పాత్ర ఉందా?’ అని అడిగారు. దాంతో ఆయనను రమ్మని చెప్పి, అప్పటికప్పుడు చిత్రబృందమంతా కలసి కూర్చొని ఓ అద్భుతమైన పాత్రను బాబు మోహన్‌కు ఇచ్చారు. ఆయన నటించింది చిన్న పాత్రే అయినా ఎంత ముఖ్యమైనది. క్లైమాక్స్‌లో బాబు మోహన్ ఆ రహస్యం చెప్తే కానీ లారీ డ్రైవర్ గెలవడు. అంతటి ప్రాధాన్యతను సంతరించుకుంది’’ అని ఆయన అన్నారు. సినిమాలో శారద కలెక్టర్ పాత్రలో నటించారు. అయితే ఆమె మీద చిత్రీకరించిన కొన్ని సన్నివేశాలు కామెడీగా అనిపించాయి. కలెక్టర్‌కు అలాంటి సీన్స్ బాగోవని తీసేసి, రీషూట్‌చేశాం అంటూ నాటి రోజులు గుర్తు చేసుకున్నారు పరుచూరి గోపాలకృష్ణ.