సినిమాలకు రివ్యూలు ఇవ్వడంలో అందరి దారి వేరు, పరుచూరి గోపాలకృష్ణ దారివేరు. సినిమా రన్ అంతా అయిపోయిన తర్వాత ఆయన విశ్లేషణాత్మకంగా రివ్యూ ఇస్తూ ఉంటారు. ఏం చేశారు, ఏం చేయకుండా ఉండాల్సింది, ఏం చేయకపోవడం వల్ల సినిమాకు ఆ ఫలితం వచ్చింది లాంటి విషయాలు చెబుతుంటారు. అలా తాజాగా ఆయన ‘భగవంత్ కేసరి’ సినిమా గురించి తనదైన శైలిలో రివ్యూ ఇచ్చారు. నందమూరి బాలకృష్ణ – అనిల్ రావిపూడి – శ్రీలీల – కాజల్ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘భగవంత్ కేసరి’.
ఈ సినిమా ఇటీవల థియేటర్లలోకి వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. (Bhagavanth Kesari) ఈ సినిమా రివ్యూ చెబుతూ… స్క్రీన్‌ప్లే విషయంలో దర్శకుడు అనిల్ రావిపూడి కబడ్డీ ఆడుకున్నారని గోపాలకృష్ణ మెచ్చుకున్నారు. సినిమా ప్రధాన అంశానికి (కూతురు సెంటిమెంట్) కట్టుబడి ఉంటూనే బాలకృష్ణ- కాజల్‌ల మధ్య ప్రేమను సెకండరీగా చూపించారు అని తెలిపారు. తండ్రి, కూతురు సెంటిమెంట్ కథలను చాలా చూశాం. రొటీన్‌కు భిన్నంగా అనిల్ రావిపూడి స్క్రీన్‌ప్లేతో సినిమాను ఇంకాస్త అందంగా తీర్చిదిద్దారు.
దర్శకుడు బి.గోపాల్ చిత్రాల్లో కంపోజ్డ్ డైలాగ్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ సినిమాలోనూ అలాంటివి చూశాం. NBK అంటే నందమూరి బాలకృష్ణ. అభిమానులు ఇలా ప్రేమగా పిలుచుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఈ సినిమాలో హీరో పాత్రను (నేలకొండ భగవంత్ కేసరి) NBKగా సెట్ చేయడంలోనూ అనిల్‌కు మంచి మార్కులు పడ్డాయి అన్నారు. తన జీవితాన్ని జైలుపాలు చేసిన విలన్లను హీరో అంతమొందించడాన్ని కథగా చూపిస్తే ఈ సినిమా ఇంత విజయం అందుకునేది కాదు.
తాను పెంచుతున్న అమ్మాయి (శ్రీలీల)ని ఆమె తండ్రి ఆశయం కోసం మిలటరీకి పంపించాలనే నేపథ్యాన్ని హైలైట్ చేయడంతో సినిమాకు కొత్తదనం వచ్చిందని చెప్పారు పరుచూరి. సెకండాఫ్‌లో కొంత ట్రిమ్ చేయాల్సిందని, సినిమా నిడివిని సుమారు రెండున్నర గంటలుగా చేసి ఉంటే వసూళ్లు ఇంకా బాగుండేవి అని పరుచూరి గోపాలకృష్ణ చెప్పారు. ఈ విషయాన్ని దర్శకుడు అనిల్ రావిపూడికి కూడా చెప్పానని తెలిపారు.