జనసేన అధినేత, ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ మరోసారి గొప్ప మనస్సును చాటుకున్నారు. భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ కు సాకీ పాడిన మొగులయ్యకు సోషల్ మీడియా వేదికగా ఆర్థిక సాయం ప్రకటించారు. ‘పవన్ కళ్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యుమన్ ఎక్సిలెన్స్’ ద్వారా పవన్ మొగులయ్యకు ఈ ఆర్థిక సహాయాన్ని అందించనున్నారు. ఆర్థిక సహాయానికి సంబంధించి కార్యాలయ సిబ్బందికి పవన్ కళ్యాణ్ తగిన సూచనలు చేశారు.
జనసేన రాజకీయ కార్యదర్శి పి హరిప్రసాద్ త్వరలోనే పవన్ కళ్యాణ్ మొగులయ్యకు 2 లక్షల రూపాయల చెక్కును అందించనున్నారని పేర్కొన్నారు. మొగులయ్య కిన్నెర మీటుతూ పాటల రూపంలో జానపద కథలను వినిపించే టాలెంట్ ఉన్న కళాకారుడు. పవన్ కళ్యాణ్ రోజురోజుకు కనుమరుగవుతున్న కళలు, జానపద కళారూపాలను యువతకు పరిచయం చేయాలనే తపన ఉన్న వ్యక్తి కావడంతో మొగులయ్యకు ఆర్థిక సాయం ప్రకటించారు.
భీమ్లా నాయక్ సాంగ్ వల్ల మొగులయ్యను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతుండగా పలువురు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లు మొగులయ్యకు ఛాన్స్ ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. సమాజాన్ని చైతన్యపరిచే వీరగాథలు చెప్పే మొగులయ్యను ఆయన అభిమానులు పండుగ సాయన్న అని పిలుచుకునేవారు. మొగులయ్య భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ సాకీని అద్భుతంగా పాడటంతో ఆయనకు పవన్ అభిమానుల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ కు రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నాయనే సంగతి తెలిసిందే. భీమ్లా నాయక్ పాట వల్ల తనకు వందల సంఖ్యలో కాల్స్ వస్తున్నాయని పవన్ సినిమాకు మరో పాట పాడాలని ఉందని మొగులయ్య చెబుతున్నారు.
శ్రీ మొగులయ్య గారికి రూ.2లక్షల ఆర్థిక సాయం అందించిన శ్రీ @PawanKalyan గారు.