ఆంధ్రప్రదేశ్ లో మూడేళ్ల ముందుగానే ఎన్నికల వేడి రాజుకుంది. జన సేన పార్టీ అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యే గా పోటీ చేస్తున్నట్లు ప్రకటించగానే అన్ని రాజకీయ పార్టీల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. అనంతపురం లో గురువారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ జనసేన పార్టీ తొలి కార్యాలయం అనంతపురంలో ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పగానే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ పార్టీ ఎమ్మెల్యే లతో మీటింగ్ నిర్వహించినట్లు తెలిసింది.
ముఖ్యంగా అనంతపురం ఎమ్మెల్యే లతో పవన్ జోరుని తగ్గించే చర్యలను చేపట్టాలని సూచించినట్లు సమాచారం. పవన్ కి చెక్ చెప్పగల సామర్థ్యం అనంతపురం జిల్లా హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన బాలకృష్ణ కే ఉందని ఎమ్మెల్యేలు సీఎం కి విన్నవించడంతో.. ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు టాక్. గౌతమి పుత్ర శాతకర్ణి షూటింగ్ లో బిజీగా ఉన్న బాలకృష్ణ తో నిన్న రాత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడారని వెంటనే అనంతపురంలో సభ ఏర్పాటు చేయాలనీ చెప్పగా, అందుకు అయన అంగీకరించినట్లు టీడీపీ నేతలు తెలిపారు. ఈ వారాంతంలో హిందూపురంలో బాలకృష్ణ భారీ బహిరంగ సభ నిర్వహించి పవన్ కళ్యాణ్ విసిరిన ప్రశ్నలకు పంచ్ లు ఇవ్వనున్నట్లు వెల్లడించారు.