గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హిందూ ధర్మం పరిరక్షించాలంటూ భారీ ఎత్తున చర్చలు లేవనెత్తిన విషయం తెలిసిందే. తిరుపతి లడ్డూ తయారీలో వాడే నెయ్యులో జంతువుల కొవ్వు కలిసిందని వచ్చిన రిపోర్ట్స్ ను దృష్టిలో పెట్టుకుని ఈ విధంగా హల్ చల్ చేశాడు పవన్ కళ్యాణ్. ఏకంగా వెంకటేశ్వర స్వామి దేవాలయానికి మకిలి పట్టిందని, ఆ పాపాన్ని కడిగేందుకు 11 రోజుల దీక్ష కూడా చేపట్టాడు పవన్ కళ్యాణ్.
అయితే.. ఈ విషయమై స్పందించిన న్యాయస్థానం “దేవుళ్లను రాజకీయాల్లోకి లాగకండి” అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మొట్టికాయ వేసింది. దాంతో.. ఇష్యూ మొత్తం పవన్ కళ్యాణ్ మీదకి డైవర్ట్ అయ్యింది. నిజానికి ఈ ఇష్యూని మొదలుపెట్టింది చంద్రబాబు అయినప్పటికీ.. తీవ్రతరం చేసింది మాత్రం పవన్ కళ్యాణ్. ఇప్పుడు స్వయంగా న్యాయస్థానం లడ్డూలో జంతువు కొవ్వు కలిసినట్లు ఆధారం లేదు అని నిర్ధారించడం పవన్ కళ్యాణ్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసింది.
మొన్నటివరకు సైలెంట్ గా ఉన్న అల్లు అర్జున్ (Allu Arjun) అభిమానులు మరియు వైసీపీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ ను ట్విట్టర్లో ట్రోల్ చేయడం మొదలెట్టారు. హీరోగా కంటే పొలిటికల్ గా ఎక్కువ బ్యాడ్ అయిపోయాడు పవన్ కళ్యాణ్. ఉన్నపళంగా పవన్ కళ్యాణ్ క్రెడిబిలిటీని ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. నిజంగానే సనాతన ధర్మ రక్షణ కోసం మాత్రమే పవన్ కళ్యాణ్ ఈ విధంగా రియాక్ట్ అయ్యాడని, రాజకీయ లబ్ధి కోసం కాదు అని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది.
మరి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఈ విషయమై ఎలా రెస్పాండ్ అవుతాడో, ఏమని తన కార్యకలాపాలను జస్టిఫై చేసుకుంటాడో చూడాలి. అప్పటివరకు పవన్ కళ్యాణ్ పై జరుగుతున్న సోషల్ మీడియా ట్రోలింగ్ ని పవన్ కళ్యాణ్ అభిమానులు మరియు జనసైనికులు ఏదో ఒకలా డిఫెండ్ చేయక తప్పదు!