ప్రముఖ కోలీవుడ్ నటుడు షిహాన్ హుసైని (Shihan Hussaini) (60) ఈ రోజు తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న హుసైని చైన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం కన్నుమూశారు. ఈ విషయాన్ని హుసైని కుటుంబసభ్యులు సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించారు. ఆయన మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఏపీ డిప్యూటీ సీఎం, ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్‌కు (Pawan Kalyan) హుసైని గురువు కావడం గమనార్హం.
పవన్ కల్యాణ్‌కు షిహాన్ హుసైని (Shihan Hussaini).. మార్షల్ ఆర్ట్స్, కరాటే, కిక్ బాక్సింగ్ తదితర శిక్షణ ఇచ్చారు. షిహాన్ హుసైని 1986లో విడుదలైన ‘పున్నగై మన్నన్’ సినిమా ద్వారా తమిళ చిత్రసీమకు పరిచయమయ్యారు. ఆ తర్వాత వరుస సినిమాలు చేసినా విజయ్ హీరోగా నటించిన ‘బద్రి’ (Badri) సినిమా హుసైని మంచి గుర్తింపునిచ్చింది. హుసైనీ ఆర్చరీలోనూ శిక్షకుడిగా వ్యవహరించారు. ఆర్చరీలో 400 మందికి పైగా విద్యార్థులను తయారుచేశారు.
90వ దశకంలో పవన్ కల్యాణ్‌కు కరాటే నేర్పించిన రోజుల్ని హుస్సేనీ గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. దానికి సంబంధించిన వీడియోలు, ఇంటర్వ్యూలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 90వ దశకంలో పవన్‌కు విద్యను నేర్పించారు. అయితే ఆ సమయంలో శిక్షణ ఎవ్వరికీ ఇవ్వొద్దని హుస్సేనీ అనుకున్నారట. కానీ పవన్ మాత్రం రోజూ వచ్చి వెళ్తుండేవాడట. పవన్ కళ్యాణ్ పట్టుదల చూసి హుస్సేనీ కరాటే నేర్పించారట.
పవన్ కల్యాణ్ అలా ఏడాది పాటుగా హుస్సేనితో ఉన్నాడట. ఆ సమయంలో ఇంట్లోనే ఉండి టీ అందించేవాడని, ఇంటిని కూడా శుభ్రం చేసేవాడని హుస్సేని చెప్పినట్లు వీడియోలు వైరల్ అవుతున్నాయి. మొదట్లో పవన్ తనని తాను చిరంజీవి (Chiranjeevi) తమ్ముడుగా పరిచయం చేసుకోలేదట. మూడు, నాలుగు నెలల తరువాత ఆ విషయాన్ని చెప్పాడట. సామాన్యుడిలా వచ్చి, విద్యను నేర్చుకుని, తన ప్రతిభను చాటుకోవాలని అనుకున్నాను అని హుస్సేనితో పవన్ అన్నాడట.