సినిమాల్లోనే కాదు బయట కూడా హీరో అని పవన్ కళ్యాణ్ అనేక సార్లు నిరూపించుకున్నారు. అనారోగ్య సమస్యలతోను .. ఆర్ధికపరమైన ఇబ్బందులతోను సతమతమయ్యే ఎంతో మందికి ఆయన తనవంతు సాయాన్ని అందించారు. చేసిన సాయం గురించి రెండో చేతికి కూడా తెలియనివ్వరు. సాయం పొందిన వారు కృతజ్ఞతతో బయటికి చెప్పడంతో ఆయన మనసు ప్రపంచానికి తెలుస్తోంది. మొన్న రేణు దేశాయ్ పేద అమ్మాయి గురించి చెప్పడంతో.. ఆ విద్యార్థినికి చదువుకి కావాల్సిన ఆర్ధిక సాయం చేసారు. నిన్న
గుంటూరు శేషేంద్ర శర్మ రచనల్లో గొప్ప పుస్తక మైన ‘ఆధునిక మహాభారతం’ అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో, మలి ముద్రణకి ఏర్పాట్లు చేయమనీ .. 25000 పుస్తకాలకి అవసరమయ్యే ఖర్చు తాను భరిస్తానని పవన్ శేషేంద్ర శర్మ కుమారుడికి మాట ఇచ్చారు.
నేడు తనకి నటనలో మెళకువలు నేర్పిన గురువు సత్యానంద్ కి ఆర్ధిక సాయం చేసి తన అభిమానులకు స్పూర్తిగా నిలిచారు.
పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి వచ్చే ముందు వైజాక్ లోకి సత్యానంద్ ఇనిస్టిట్యూట్లో క్రాష్ కోర్సు చేశారు. అప్పటినుంచి గురువుతో పవన్ టచ్లోనే ఉన్నారు. కొన్ని రోజుల క్రితం సత్యానంద్ తన చెల్లెలి పెళ్ళికి రావాలని పవర్ స్టార్ ని ఆహ్వానించారు. వెంటనే పవన్ గురువుని తన ఇంటికి పిలిపించారు. “నాకు రూ.50,000 లు ఇచ్చి పెళ్లి ఖర్చులకు ఉంచమన్నారు. అలాగే నూతన దంపతులకు కానుకగా ఒక బ్యాగ్ ఇచ్చారు. అవసరమైతే అందులోని డబ్బులను కూడా వాడుకోమని చెప్పారు.” అని సత్యానంద్ మీడియాకు వెల్లడించారు.