పవన్ కళ్యాణ్ తన ‘జనసేన’ పార్టీ బలోపేతం చేయడానికి హాజరవుతున్న మీటింగ్లలో భాగంగా అధికారిక పార్టీ పై అతను చేస్తున్న విమర్శల కారణంగానే సినిమా పరిశ్రమ పై జగన్ ప్రభుత్వం ఫోకస్ పెట్టిందని అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. ‘వకీల్ సాబ్’ సినిమాలో కొన్ని డైలాగులు కూడా వైసిపి పార్టీని టార్గెట్ చేసినట్టు ఉన్నాయని వారు భావించి వెంటనే టికెట్ రేట్లు వంటివి తగ్గించడం మొదలుపెట్టారు. అటు తర్వాత సంగతి అందరికీ తెలిసిందే.
కిందా మీదా పడి చిరంజీవి వంటి సినీ పెద్దలు సీఎం జగన్ ను కలిసి దీనికి ఒక తాత్కాలిక పరిష్కారాన్ని తీసుకొచ్చారు.మంత్రి పేర్ని నాని ఎప్పటికప్పుడు ఈ సమస్యల్ని జగన్ వద్దకు తీసుకెళ్ళడం జరిగింది. ఇదిలా ఉండగా.. ఇటీవల ఆయన ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనే ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి.
ఆయన మాట్లాడుతూ.. “పవన్ కళ్యాణ్ టార్గెట్ ఏంటమ్మా… ఏంటి పవన్ కళ్యాణ్..! అతని కెరీర్ మొత్తం కలుపుకుని ఎన్ని సినిమాలు తీసాడు. పోనీ ఏడాదికి ఎన్ని సినిమాలు తీస్తాడు.అతని నుండీ సంవత్సరానికి ఒక సినిమా వస్తుందేమో. ఆ ఒక్క సినిమా కోసం మేము ఏంటి ఆయన్ని టార్గెట్ చేసేది. ఆయన్ని మేము దెబ్బ తీసేది ఏముంది? ఫిలిం ఇండస్ట్రీలో ఇన్ని పదుల సంఖ్యలో సినిమాలు వస్తుంటే.. ఆయన సంవత్సరానికి తీసేది ఒక్క సినిమా. దాన్ని దెబ్బ తీస్తే మాకేంటి వచ్చేది.
ఇండస్ట్రీకి ఆయనకి సంబంధం ఏంటి అసలు? ఇండస్ట్రీలో ఆయన కూడా ఒక నటుడు. అల్లు అర్జున్ సినిమా కంటే ఎక్కువ కలెక్షన్లు వస్తున్నాయా ఈయన సినిమాకి. చిరంజీవి, ఎన్టీఆర్, రాంచరణ్, ప్రభాస్, మహేష్ బాబు.. వీళ్ళ సినిమాల కంటే కూడా ఎక్కువ కలెక్ట్ చేసేస్తున్నాయా ఆయన సినిమాలు. ఎప్పుడో నా చిన్నప్పుడు ‘అత్తారింటికి దారేది’ కి కలెక్షన్లు వచ్చాయి కదా అని చెప్పి.. దాని పేరే చెప్పుకుని అమ్ముకుంటూ వెళ్తుంటే.. ఆయన అంటే ఎవరికి భయం? సినిమాల్లోనూ భయం లేదు.. రాజకీయాల్లోనూ భయం లేదు ఆయన అంటే..!” అంటూ విరుచుకుపడ్డారు పేర్ని నాని.