సినిమా పోస్టర్ వల్ల ఏం తెలుస్తుంది.. ఆ సినిమాలో హీరో, హీరోయిన్ ఎవరు? మెయిన్ టీమ్ ఎవరు? ఎప్పుడు విడుదల? లాంటి వివరాలు తెలుస్తాయి. రిలీజ్ అయ్యాక అయితే సినిమా వచ్చి ఎన్ని రోజులు అయ్యింది అనేది తెలుస్తుంది. ఒకప్పుడు థియేటర్ల సంఖ్య రాసేవారు. ఇప్పుడు వసూళ్లు రాస్తున్నారు. అయితే ఇదంతా రెగ్యులర్‌గా జరిగేదే. ఒక్క పోస్టర్‌తో గొడవలు మొదలైతే, చర్చలు మొదలైతే, పంచాయితీలు జరిగితే.. అది కచ్చితంగా స్టార్ హీరో సినిమానే అని చెప్పాలి. తాజాగా అలాంటి పోస్టరే విడుదలైంది.
ఈ ఏడాది సంక్రాంతికి (Chiru) చిరంజీవి, బాలకృష్ణ బాక్సాఫీసు దగ్గరకు వచ్చి తమ అదృష్టం పరీక్షించుకున్నారు. బాలకృష్ణ డ్యూయల్ రోల్‌లో వస్తే.. రవితేజను వెంటబెట్టుకుని చిరంజీవి వచ్చాడు. రెండు సినిమాలకు మంచి వసూళ్లే వచ్చాయి. అయితే చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ వసూళ్లే ఎక్కువ అని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. సినిమాలు థియేటర్లలో ఉన్నప్పుడు వసూళ్ల లెక్కల గురించి పెద్దగా చర్చ ఏమీ జరగలేదు. ఫ్యాన్స్ తమ హీరో సినిమానే పెద్ద హిట్ అంటే తమ హీరో సినిమానే పెద్ద హిట్ అనుకోవడం అయితే జరిగింది.
కానీ ఇప్పుడు వంద రోజులు పూర్తయిన తరుణంలో ఓ పోస్టర్ రిలీజ్ చేసిన ‘వీర సింహా రెడ్డి’ టీమ్ పెద్ద చర్చ జరిగే పరిస్థితిని తీసుకొచ్చింది. ‘వీర సింహా రెడ్డి’ వంద రోజులు పూర్తయిన సందర్భంగా ఓ ఫంక్షన్‌ను నిర్వహించాలని టీమ్ ఫిక్స్ అయ్యింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అందులో సెంచరీ విత్ సింగిల్ హ్యాండ్ అని రాసుకొచ్చారు. నగరంలో చాలా చోట్ల ఆ పోస్టర్‌లు కనిపిస్తున్నాయి. దీంతో చిరంజీవి ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు అని సమాచారం.
‘వాల్తేరు వీరయ్య’లో ఇద్దరు హీరోలు ఉన్నారు అనే విషయాన్ని ఎద్దేవా చేస్తూ ‘వీర సింహా రెడ్డి’కి ఇలా పోస్టర్ వేశారు అని అంటున్నారు. అయితే ఈ పోస్టర్‌లు చేయించేది నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్సే అనే విషయం తెలిసిందే. వాళ్ల సినిమా మీద వాళ్లే సెటైర్ వేసుకునే ప్రయత్నం చేయరు అనేది గుర్తుంచుకోవాల్సిన విషయం. దీంతో అసలు ఈ పోస్టర్ల లొల్లి ఎందుకొచ్చింది అనే ప్రశ్న వినిపిస్తోంది. మరోవైపు పోస్టర్ పట్టుకుని ఎందుకింత రచ్చ అనేవాళ్లూ ఉన్నారు.