టాలీవుడ్ హీరో చొక్కా నలగకుండా ఫైట్ చేయాలి… కాలర్‌కు మరక అంటకుండా యాక్షన్ సీన్ పూర్తి చేసేయాలి. క్లైమాక్స్‌లో భారీ ఫైట్ చేసి విలన్‌ను ఓడించాలి. ఇదంతే… చాలా రోజులుగా ఇలానే నడుస్తోంది. దీనికి ఏమాత్రం తేడా కొట్టినా… సినిమా బోల్తా కొట్టేస్తుంది. హీరో వరుసగా నాలుగు దెబ్బలు కాస్తే చాలు అభిమానులు తట్టుకోలేరు. హీరో క్లైమాక్స్‌లో చనిపోతాడు అంటే… కష్టమే అని చెప్పాలి. పోనీ హీరోయిన్ పాత్ర చనిపోవాలి అంటే… అందులో ఇద్దరు హీరోయిన్స్ ఉండాలి. పోనీ హీరోహీరోయిన్ ఇద్దరూ చనిపోయినా ఫ్యాన్స్ తట్టుకోలేరు.
ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే… ‘రాధే శ్యామ్’లో యాంటీ క్లైమాక్స్ ఉంటుందని వార్తలొస్తున్నాయి. హీరో,హీరోయిన్ల పాత్రలు చనిపోవడం గురించి ఇందాక మనం పూర్తిగా చెప్పుకోలేదు. అలాంటి పరిస్థితే వస్తే, ఏకంగా సినిమాను రీషూట్ చేసి క్లైమాక్స్ మార్చాల్సి వస్తుంది. మహేష్‌బాబు ‘బాబి’ చూశాం కదా. ఇదంతా చూసి కూడా ‘జిల్’ రాధాకృష్ణ… ప్రభాస్ ‘రాధేశ్యామ్’కి యాంటీ క్లైమాక్స్ రాశాడు అంటున్నారు. అయితే మరి ఈ క్లైమాక్స్‌ను ఉంచారా.. లేక మార్చేశారా అనేది తెలియడం లేదు.
సినిమా టీజర్‌లో ఈ ‘మరణం’ గురించి డైలాగ్ కూడా అందుకే పెట్టారు అంటున్నారు. టాలీవుడ్ సెంటిమెంట్ ప్రకారం ఇలాంటి యాంటీ క్లైమాక్స్‌లు హిట్ అయిన సందర్భాలు లేవు. కాబట్టి ప్రభాస్ టీమ్ అలా చేస్తుందనుకోవడం లేదు అభిమానులు. అయితే కొత్తదనం చూపిస్తాం అని చెప్పి ఏమన్నా ప్రయత్నం చేస్తున్నారా? అనే గుబులు అయితే అభిమానుల్లో కలుగుతుంది. చూద్దాం.. ప్రభాస్ రిస్క్ చేసి హిట్ కొడతాడా? రస్క్ మిగుల్చుకుంటాడా.