ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది.. ప్రతి హీరో అభిమానులు తమ హీరోల సినిమాలను రీ రిలీజ్ చేసుకొని ఆనంద పడుతున్నారు.. ఒక హీరోకి మించి మరో హీరో అభిమానులు సందడి చేస్తున్నారు .. ఆ తరహా లోనే ప్రభాస్ నటించినటువంటి యోగి సినిమా ఈరోజు ఆగస్టు 19 న రీ రిలీజ్ అయ్యింది.. అయితే ఫ్యాన్స్ అత్యుత్సాహం థియేటర్కు నష్టాలు తెచ్చిపెడుతుంది… ఎప్పుడో ఆడేసి ఆన్ లైన్ లో ఫ్రీగా దొరికే సినిమాలను మరోసారి థియేటర్ లో అనుభూతి చెందాలనుకున్నప్పుడు మన ఉత్సాహం ఇంకొకరికి నష్టం కలిగించేలా ఉండకూడదు.
ఇవాళ రిలీజైన యోగిని ప్రదర్శిస్తున్న ఏపీలోని కర్నూలు జిల్లా నంద్యాల రాజ్ టాకీస్ లో ఫ్యాన్స్ స్క్రీన్ ని రెండు చోట్ల చింపేయడంతో షో అర్ధాంతరంగా ఆగిపోయింది. దీంతో ఆ ఊరి ఎగ్జిబిటర్ల అసోసియేషన్ ఇకపై ఏ హీరో రీ రిలీజులు ప్రదర్శించబోమని నిమిషాల వ్యవధిలో ప్రకటించేయడంతో అభిమానులు షాక్ తిన్నారు. ఆనందంతో ఈలలు వేయాలి కానీ ఇలా శృతి మించి ప్రవర్తించడం ముమ్మాటికీ తప్పే. ఇది మొదటిసారి కాదు.
గతంలో విజయవాడ థియేటర్ లోనూ ఇలాంటి సంఘటన జరిగితే సుమారు అయిదు లక్షల దాకా నష్టం వాటిల్లింది. ఆ సినిమా వేసినందుకు వచ్చిన కలెక్షన్ కూడా అంత లేదు. దీంతో పాత సినిమాలంటే చాలు యాజమాన్యాలు భయపడే పరిస్థితి వచ్చింది. కొత్త రిలీజుల్లో అధిక శాతం కనీస స్థాయిలో జనాన్ని రప్పించలేకపోవడంతో కనీసం వీటితో అయినా మెయింటనెన్స్, సిబ్బంది జీతాలు, అద్దెలు తదితర ఖర్చులు గిట్టుబాటు అవుతాయనే ఉద్దేశంతో షోలు వేసుకోవడానికి అనుమతులు ఇస్తున్నారు. తీరా చూస్తే కొందరి వ్యవహార శైలి తీరని డ్యామేజ్ చేస్తోంది.
ఇది సీరియస్ గా ఆలోచించాల్సిన విషయమే. విపరీతంగా పెరిగిపోతున్న రీ రిలీజుల వల్ల కొత్త సినిమాలు బాగా ఎఫెక్ట్ అవుతున్నాయి. నెలకు అయిదారు వచ్చే పరిస్థితి నెలకొనడంతో యూత్ వీటిని చూసి ఎంజాయ్ చేసి ఫ్రెష్ గా విడుదలైనవాటిని లైట్ తీసుకుంటున్నారు. దీని వల్ల ఎంతలేదన్నా దెబ్బ పడుతుంది. అయితే వీటిని నియంత్రించే వ్యవస్థ కానీ మార్గం కానీ లేదు. థర్డ్ పార్టీలు ప్రవేశించి ఈ వ్యవహారాలను నిర్మాతల నుంచి తమ చేతుల్లోకి తీసుకున్నాక డిజాస్టర్లకు సైతం ఫ్యాన్స్ ఎగబడి వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సమస్యకు పరిష్కారం అంత ఈజీ అయితే కాదు.