రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూసి సంగతి తెలిసిందే. కొన్నాళ్లుగా పోస్ట్ కోవిడ్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆయన హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటూ మృతి చెందారు. ఆయన మరణవార్త సినీ ఇండస్ట్రీని శోకసంద్రంలో ముంచేసింది. ముఖ్యంగా ప్రభాస్ తన పెదనాన్న మరణాన్ని తట్టుకోలేకపోతున్నారు. కృష్ణంరాజుతో ప్రభాస్ కి ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కృష్ణంరాజుకి ప్రభాస్ అంటే అమితమైన ప్రేమ. సినిమా రంగంలో ప్రభాస్ ఎదుగుదలను చూసి పొంగిపోతుంటారాయన.
చాలా సందర్భాల్లో ఈ విషయాన్ని వెల్లడించారు. అటువంటి వ్యక్తిని కోల్పోవడం ప్రభాస్ ను బాధిస్తుంది. సెలబ్రిటీలంతా కృష్ణంరాజుకి నివాళులు అర్పించడానికి ఆయన ఇంటికి చేరుకుంటున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా కృష్ణంరాజుకి నివాళులు అర్పించి ప్రభాస్ ని పరామర్శించారు. ఆ సమయంలో ప్రభాస్ కన్నీళ్లు పెట్టుకున్నారు. దీంతో మంత్రి తలసాని.. ప్రభాస్ ని ఓదార్చారు. ఈ వీడియో బయటకొచ్చింది. ప్రభాస్ కన్నీటిపర్యంతం కావడంతో అభిమానులు కూడా ఎమోషనల్ అవుతున్నారు.
‘నిన్ను ఇలా చూడలేకపోతున్నాం అన్నా.. ఏడవద్దు ప్లీజ్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ధైర్యంగా ఉండమని సూచిస్తున్నారు. ఇక కృష్ణంరాజు వయసు 83 ఏళ్లు. వయోభారం వలన వచ్చిన అనారోగ్యం వలన కొన్ని రోజుల నుంచి నుంచి ఆయనకు సమస్యలు తలెత్తుతున్నాయి. కరోనా సమయంలో కూడా రెండు సార్లు హాస్పిటల్ కి వెళ్లొచ్చారు. అప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిపై వదంతులు వచ్చాయి. నిన్ననే హాస్పిటల్ లో ఉన్న కృష్ణంరాజు చూడడానికి హాస్పిటల్ కి వెళ్లారు ప్రభాస్. ఆ వీడియో కూడా బయటకొచ్చింది.