బాహుబలి సినిమా తర్వాత.. ముందు అనే రీతిలో ప్రభాస్ కెరీర్ గురించి చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ సినిమాల తరవాత ప్రభాస్ ఇమేజ్, క్రేజ్ విపరీతంగా పెరిగాయి. ఒక భాషకే పరిమితం కాకుండా ఇండియన్ స్టార్ అయ్యారు. ఇదివరకు కంటే ఎంతో అలోచించి ప్రభాస్ సినిమాలు చేయాల్సి ఉంటుంది. అందుకే సుజీత్ సైతం సాహో స్క్రిప్ట్ ని ఇంటర్నేషనల్ స్థాయిలో తీర్చిదిద్దారు. అభిమానుల అంచలనాలకు మించి సినిమా ఉండేలా తెరకెక్కిస్తున్నారు. అందుకే ఆలస్యం అవుతున్నా ప్రభాస్ అభిమానులు ఆనందంగానే ఉన్నారు. కానీ రీసెంట్ గా సోషల్ మీడియాలో వస్తున్న వార్త వారిని కలవరపెడుతోంది. తమిళ కొరియోగ్రాఫర్ రాజు సుందరం దర్శకత్వంలో ప్రభాస్ సినిమా చేయనున్నారనే న్యూస్ నిద్రలేకుండా చేస్తోంది.
ఎందుకంటే గతంలో ప్రభుదేవా దర్శకత్వంలో పౌర్ణమి మూవీ చేశారు. అది ఫెయిల్. ఆలాగే మరో కొరియోగ్రాఫర్ లారెన్స్ దర్శకత్వంలో రెబల్ చేశారు. అదీ బోల్తా కొట్టింది. ఇప్పుడు రాజు సుందరంతో అనగానే ఫ్లాప్ గ్యారంటీ అని భయపడుతున్నారు. ప్రభుదేవా, లారెన్స్ అయితే డైరెక్టర్లుగా కొన్ని విజయాలను చూసారు. రాజు సుందరానికి డాన్స్ మాస్టర్ గా మంచి పేరున్నా.. డైరక్టర్ గా హిట్ సాధించలేదు. తమిళంలో అతను దర్శకత్వం వహించిన ‘ఏగన్’ ఫ్లాప్ అయింది. తర్వాత తెలుగులో ‘కిరాక్ పార్టీ’ చేయాల్సింది. కానీ స్క్రిప్టు దశలో సుందరం పని తీరు నచ్చక పక్కన పెట్టారు. మరి అటువంటి వ్యక్తి తో సినిమా చేయడానికి ప్రభాస్ ఎలా ఒప్పుకున్నారంటూ ఫ్యాన్స్ బాధపడుతున్నారు. దీనిపై ప్రభాస్ ఎలా స్పందిస్తారో చూడాలి.