రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు బాలీవుడ్ కి చమటలు పట్టిస్తున్నాడా అంటే నిజమే అంటున్నారు అందరూ. ఒకప్పుడు తెలుగు సినిమా వేరు, ఇప్పుడు వేరు అన్నట్లుగా అయ్యింది మార్కెట్. చిన్న హీరోలు సైతం బాలీవుడ్ లో బాక్సాఫీస్ దగ్గర తొడలు కొడుతున్నారు. అక్కడ స్టార్ హీరోలకి, కపూర్స్ కి, ఖాన్స్ కి షాక్ ఇస్తున్నారు. ముఖ్యంగా బాహుబలి సినిమా తర్వాత తెలుగు సినిమా మార్కెట్ పెరిగిందనే చెప్పాలి. సైరాతో మెగాస్టార్, సాహో తో మరోసారి రెబల్ స్టార్ ఇద్దరూ కూడా అక్కడ మార్కెట్ ని కుమ్మేశారు. అంతేకాదు, కుర్రహీరోల సినిమాలు సైతం డబ్బింగ్ అయ్యి యూట్యూబ్ ని షేక్ చేస్తున్నాయి. ఈ తరుణంలో రాబోతున్న ప్రభాస్ సినిమాలు బాలీవుడ్ బడా హీరోలని సైతం భయపెడుతున్నాయి.
సాహో సినిమా తర్వాత ల్యాంగ్ గ్యాప్ లో రాధేశ్యామ్ అంటూ ప్రభాస్ వస్తున్నాడు. ఈ సినిమా ఇప్పుడు బాలీవుడ్ ని షేక్ చేసేందుకు రెడీ అవుతోంది. ఎందుకంటే, బాలీవుడ్ లో ఒక్కసారి లవ్ స్టోరీకి హీరో కనెక్ట్ అయితే, అక్కడ స్టార్ అయిపోతాడు. అప్పట్లో సల్మాన్ ఖాన్, ఆమీర్ ఖాన్, షారూఖ్ ఖాన్ , అలాగే అనిల్ కపూర్, షాహిద్ కపూర్, రిషి కపూర్ ఇలా అందరూ కూడా లవ్ స్టోరీలతోనే స్టార్ హీరోలు అయ్యారు. ఇప్పుడు ఇదే బాలీవుడ్ స్టార్స్ ని కలవరపరుస్తోంది. ఈ సినిమా సూపర్ హిట్ అయితే ప్రభాస్ మార్కెట్ ని ఎవ్వరూ ఊహించలేరు. ఒక రేంజ్ లో ఉంటుంది.
ఇక రాధేశ్యామ్ తర్వాత కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో తీస్తున్న సలార్ అయితే దడపుట్టించేస్తోంది. ఎందుకంటే, ఆల్రెడీ కేజీఎఫ్ కి బాలీవుడ్ లో భారీ డిమాండ్ ఉంది. అదే సినిమా డైరెక్టర్ అందులోనూ ప్రభాస్ తో చేస్తున్న యాక్షన్ సినిమా కాబట్టి బాలీవుడ్ కి చెమటలు పట్టేస్తున్నాయి. లవ్ స్టోరీ తర్వాత వచ్చే యాక్షన్ సినిమా హిట్ అయితే మార్కెట్ మామూలుగా ఉండదు. అక్కడ ప్రభాస్ చించి ఆరేస్తాడు అంతే. అందుకే, ముందుగానే ప్రభాస్ మార్కెట్ ని ఊహించి మరీ ఓంరౌత్ మైథలాజికల్ మూవీకి రెడీ అయ్యాడు. ఆది పురుష్ సినిమా కూడా మంచి టాక్ వచ్చిందంటే ప్రభాస్ కి అక్కడ పూజలు చేసేస్తారు నో డౌట్. రాముడిగా ఒక్కసారి అక్కడ ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు అంటే ఇంక వేరే హీరోలు ఎవ్వరూ గుర్తుకు రారు. ప్రభాస్ పేరు బాలీవుడ్ మూల మూలలా మారుమోగిపోతుంది. హేటర్స్ కూడా లవర్స్ గా మారిపోతారు.
ఈ మూడు సినిమాలు ఒక ఎత్తు అయితే, నాగ్ అశ్విన్ తో కమిట్ అయిన సినిమా మరో ఎత్తు. ఈ సినిమా సైన్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని ముందుగానే చెప్పారు. టైమ్ మిషన్ బ్యాక్ డ్రాప్ లో ఉంటే బాలీవుడ్ కి చాలా ఈజీగా కనెక్ట్ అయిపోతుంది. అందులోనూ ఏమాత్రం పాజిటివ్ టాక్ సినిమాకి వచ్చినా ఒక రేంజ్ మార్కెట్ అవుతుంది. రాబోయే మూడు సినిమాలకి ఈ సినిమా మంచి ప్లస్ పాయింట్ అవుతుంది. అందుకే, ఇప్పుడు ప్రభాస్ ని చూస్తుంటే అక్కడ స్టార్ హీరోలు సైతం ఏం చేయాలో అర్ధం కాని పరిస్థితుల్లోకి వెళ్లారు. ఈ సినిమాలు చూస్తుంటే బడా నిర్మాతలు సైతం ప్రభాస్ డేట్స్ కోసమే వెయిట్ చేస్తున్నారు. మొత్తానికి సౌత్ నుంచి అందులోనూ తెలుగులో నుంచి స్టార్ హీరోగా ఎదిగి ఇప్పుడు నేషనల్ స్టార్ గా మారుతున్నాడు మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.