ఇప్పటి వరకూ రాజమౌళి తో పనిచేసిన ఏ హీరోకి అయినా.. తరువాత సినిమా పెద్ద డిజాస్టర్ అవుతూవస్తుంది. ఇది ఎప్పటి నుండో ఉన్న సెంటిమెంట్. ప్రభాస్ లాంటి హీరోతో ‘బాహుబలి’ వంటి పాన్ ఇండియన్ సినిమాని తెరకెక్కించాడు రాజమౌళి. ఆ సినిమా ఇండియన్ మూవీస్ లోనే టాప్ మూవీగా నిలిచింది. తెలుగు సినిమా స్థాయిని మరింత పెంచింది. అంత పెద్ద హిట్ తర్వాత ప్రభాస్ ఏ సినిమా చేసిన అది పెద్ద డిజాస్టర్ అవ్వడం ఖాయం అని అందరూ ఫిక్స్ అయిపోయారు. అందుకు తగ్గట్టే ‘సాహో’ విడుదల రోజున డిజాస్టర్ టాక్ వచ్చింది. ఇక 300 కోట్ల బడ్జెట్ పెట్టారు కదా కనీసం 100 కోట్లయినా వస్తుందా అనే కామెంట్స్ చేసినవారు లేకపోలేదు. అయితే వారందరి అంచనాల్ని తలక్రిందులు చేస్తూ మంచి ఓపెనింగ్స్ ను సాధించింది ‘సాహో’ చిత్రం. ఇప్పటికే 350 కోట్ల గ్రాస్ ను కొల్లగొట్టింది.
ఇదిలా ఉండగా… మొదటి రోజు బాలీవుడ్ క్రిటిక్స్ ‘సాహో’ సినిమాకి డిజాస్టర్ రివ్యూలు, రేటింగ్ ఇచ్చి ఏకి పారేశారు. కానీ అక్కడి ప్రేక్షకులు మాత్రం రివ్యూలను పక్కకు పడేసి థియేటర్ ను కళకళలాడించి కలెక్షన్లు కురిపించారు. తాజాగా హిందీలో ఈ చిత్రం 100 కోట్ల నెట్ ను దాటేసింది. ‘బాహుబలి’ సిరీస్ తర్వాత 100 కోట్లు రాబట్టిన తెలుగు చిత్రం సాహోనే..! ‘బాహుబలి’ ‘బాహుబలి2’ ‘2.ఓ’ తర్వాత నాలుగో చిత్రంగా ‘సాహో’ నిలిచింది. మొదటి రోజు 24.40 కోట్లు, రెండో రోజు 25.20 కోట్లు, మూడో రోజు 29.48 కోట్లు, నాలుగో రోజు 14.20 కోట్లు, ఐదో రోజు 9.10 కోట్ల కలెక్షన్లను వసూల్ చేసింది. మొత్తంగా 102.38 కోట్ల నెట్ ను రాబట్టింది. మంగళవారం రోజున కూడా ఈ చిత్రం 9 కోట్లు వసూల్ చేసింది అంటే అక్కడ ఎంత ప్రభాస్ కు ఎంత క్రేజ్ ఉందనేది స్పష్టమవుతుంది. మొత్తానికి ‘సాహో’ బాలీవుడ్ లో హిట్టనిపించుకుంది. ప్రభాస్ కు అక్కడ మంచి మార్కెట్ ఏర్పడిందని ‘సాహో’ ప్రూవ్ చేసింది.