యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా కెరీర్ ని గురించి చెప్పేటప్పుడు బాహుబలికి ముందు.. తర్వాత అని ప్రస్తావించాల్సి ఉంటుంది. దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అంత భారీ విజయం అందుకుంది. టాలీవుడ్ కే పరిమితమయిన ప్రభాస్ ఈ ఒక్క చిత్రం ద్వారా ఇండియన్ స్టార్ గా అవతరించారు. అందుకే బాహుబలి కంక్లూజన్ ని సైతం ముందుగా అనుకున్న బడ్జెట్ లో మార్పులు చేసి తెరకెక్కిస్తున్నారు.
అలాగే బాహుబలి తర్వాత ప్రభాస్, సుజీత్ కాంబినేషన్లో రూపుదిద్దుకోనున్న మూవీ బడ్జెట్ లోను భారీ మార్పులు జరిగాయి. స్క్రిప్ట్ దశలో ఉన్నప్పుడు ఈ సినిమాను తెలుగు, తమిళం భాషల్లో చిత్రీకరించాలని భావించారు. అందుకోసం 60 కోట్ల బడ్జెట్ ని నిర్ణయించారు. బాహుబలితో యంగ్ రెబల్ స్టార్ నార్త్ ఇండియా వారికి సైతం కనెక్ట్ అయ్యారు. అక్కడ కూడా అధికంగా అభిమానులు ఏర్పడ్డారు. దీంతో కొత్త చిత్రాన్ని ఏకకాలంలో మూడు భాషల్లో నిర్మించాలని నిర్మాతలు ప్రమోద్, వంశీలు డిసైడ్ అయ్యారు. మూడు భాషల్లో అంటే బడ్జెట్ కూడా పెరుగుతుంది కదా… అందుకే వంద కోట్లు సైతం ఖర్చు చేయడానికి వారు సిద్ధమయ్యారు. నిర్మాతల ఉత్సాహం చూస్తుంటేనే ప్రభాస్ కి ఇప్పుడున్న క్రేజ్ ఎలాంటిదో అర్ధమవుతోంది.