స్టార్ హీరో ప్రభాస్ సినిమా అంటే ప్రస్తుతం కనీసం 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించాలని నిర్మాతలు భావిస్తున్నారు. ప్రభాస్ సినిమాలకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరుగుతుండటంతో నిర్మాతలు సైతం ఖర్చుకు వెనుకాడటం లేదు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సాహో, రాధేశ్యామ్ సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. ఈ సినిమాలను కొనుగోలు చేసిన బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు సినిమాకు వస్తున్న కలెక్షన్లను చూసి షాకవుతున్నారు.
సాహో, రాధేశ్యామ్ సినిమాల ఫలితాల విషయంలో ప్రభాస్ అభిమానులు కూడా సంతోషంగా లేరు. బాహుబలి2 తర్వాత స్టార్ డైరెక్టర్లకు అవకాశం ఇవ్వకుండా ప్రభాస్ కెరీర్ విషయంలో తప్పు చేశారని ఇండస్ట్రీలో కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే సాహో, రాధేశ్యామ్ అంచనాలను అందుకోకపోయినా ఆ ప్రభావం ప్రభాస్ కెరీర్ పై మాత్రం పడలేదు. ప్రభాస్ తో సినిమాలను నిర్మించడానికి నిర్మాతలు వరుసగా క్యూ కడుతున్నారు. ప్రభాస్ బాహుబలి2 తర్వాత భిన్నమైన పాత్రలను ఎంచుకుంటున్నారని అయితే స్టోరీ, స్క్రీన్ ప్లే విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
దేశవ్యాప్తంగా ప్రజలకు కనెక్ట్ అయ్యే సినిమాలలో నటిస్తే ప్రభాస్ భవిష్యత్తు ప్రాజెక్టులు సక్సెస్ సాధించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. ప్రభాస్ భవిష్యత్తు ప్రాజెక్టులపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. సక్సెస్ లో ఉన్న డైరెక్టర్ల డైరెక్షన్ లోనే ప్రభాస్ నటిస్తుండటం గమనార్హం. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సలార్ ఈ ఏడాది రిలీజ్ కావడం కష్టమేనని సమాచారం. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతోందని సమాచారం అందుతోంది.
వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రభాస్ నటించిన ఆదిపురుష్ రిలీజ్ కానుంది. ఆదిపురుష్ మూవీతో ప్రభాస్ సక్సెస్ ట్రాక్ లోకి వస్తారేమో చూడాల్సి ఉంది. రామాయణం ఆధారంగా ఆదిపురుష్ తెరకెక్కగా ఓం రౌత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ప్రభాస్ కెరీర్ లో ఆదిపురుష్ స్పెషల్ మూవీగా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.