‘మా’ ఎలెక్షన్స్ దగ్గర పడుతున్న సమయంలో ప్రకాష్ రాజ్.. మంచు ఫ్యామిలీపై విమర్శలు చేశారు. కొన్ని కుటుంబాలకే పెత్తనం కావాలని మోహన్ బాబు అన్నారని.. ఎంటర్, ఏఎన్నార్, చిరు కుటుంబాల్లో పుట్టకపోవడం నా తప్పా..? అని ప్రశ్నించారు. ‘మా’ సభ్యుడిగా నాకు పోటీ చేసే హక్కు లేదా..? అని అడిగారు. ‘మా’ నాయకత్వం కొన్ని కుటుంబాలకే ఉండాలా..? నాకు ఇక్కడే ఇల్లు ఉంది.. ఆధార్ కార్డు కూడా ఉందని అన్నారు ప్రకాష్ రాజ్.
ముఖ్యమంత్రి జగన్ తన బంధువు అని విష్ణు చెబుతున్నారని.. ఆయన విష్ణు ఒక్కరికే కాదు.. ఏపీ మొత్తానికి సీఎం కదా.. ఆయన్ను ‘మా’ ఎన్నికల్లోకి ఎందుకు లాగుతున్నారని ప్రశ్నించారు. కరోనా సమయంలో చిరంజీవి సినీ పరిశ్రమకు ఎంతో సాయం చేశారని.. మంచు కుటుంబం పరిశ్రమకు ఏం చేసిందని ప్రశ్నించారు. సినీ పరిశ్రమకు పెద్ద దిక్కు ఇప్పటికీ.. ఎప్పటికీ చిరు అన్నయ్యే అని అన్నారు. ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ సినిమా ఇండస్ట్రీకి ఆస్తులని.. పవన్ కళ్యాణ్ సినీ పరిశ్రమకు పెద్ద నిధి అని అన్నారు.
తన పాత వివాదాలను ఇప్పుడు ప్రచారంలోకి తీసుకురావడంపై ఫైర్ అయ్యారు ప్రకాష్ రాజ్. సమసిపోయిన వివాదాల గురించి ప్రస్తావించడం ఎందుకని అడిగారు. ఈ నెల 10న గెలిచాక మొదటి ఫోన్ విష్ణుకే చేస్తానని.. ‘మా’ భవన నిర్మాణానికి ఆయన సాయం కూడా తీసుకుంటానని ప్రకాష్ రాజ్ అన్నారు.