కొన్నాళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో నటుడు ప్రకాష్ రాజ్.. పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారాన్ని రేపాయో తెలిసిందే. జనసేన పార్టీ.. భారతీయ జనతా పార్టీతో జట్టు కట్టడం పట్ల ఆయన విమర్శలు గుప్పించారు. పవన్ నిలకడ లేని మనిషి అని.. పవన్ మీద జనాలు పెట్టుకున్న లంచాలు, ఆశల్ని ఆయన నెరవేర్చలేకపోయాడని అన్నారు. దీంతో పవన్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రకాష్ రాజ్ ను టార్గెట్ చేసి ఆయన్ని ట్రోల్ చేశారు. అయితే ఆ విమర్శల తరువాత ప్రకాష్ రాజ్.. పవన్ తో కలిసి ‘వకీల్ సాబ్’ సినిమాలో నటించారు.
ఆ సమయంలో సెట్లో ఇద్దరి మధ్య ఎలాంటి గ్యాప్ కనిపించలేదని.. అసలేమీ జరగనట్లు ఇద్దరు మాములుగానే ఉన్నారని చిత్రయూనిట్ వర్గాలు తెలిపాయి. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్.. ప్రకాష్ రాజ్ ని ఉద్దేశిస్తూ గొప్పగా మాట్లాడారు. ప్రకాష్ రాజ్ తనను విమర్శించినప్పటికీ.. వ్యక్తిగతంగా ఆయనంటే ఇష్టమని, ఆయన అభిప్రాయాలను గౌరవిస్తానని అన్నారు. ఇప్పుడు ప్రకాష్ రాజ్ కూడా పవన్ పై తాను చేసిన విమర్శల గురించి మాట్లాడారు. కళ్యాణ్ గారిని ప్రేమిస్తాను కాబట్టే విమర్శించానని అన్నారు. ఆయనతో రాజకీయంగా తనకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయని చెప్పారు.
పవన్ ఒక లీడర్ అని.. ఆయనంటే ఇష్టం కాబట్టే ఒక నాయకుడిగా ఎలా ఉండాలో చెప్పానని అన్నారు. ‘వకీల్ సాబ్’ సెట్స్ లో ఇద్దరి మధ్య చర్చలు సాగేవని తెలిపారు. కర్ణాటక సాహిత్యం గురించి మాట్లాడి, పవన్ కొన్ని పుస్తకాలు కావాలని అడిగినట్లు చెప్పారు. కళ్యాణ్ గారికి, తనకు సమాజం పట్ల, ప్రజల పట్ల కొన్ని ఆలోచనలు ఉన్నాయని.. ప్రజల కోసం పవన్ రాజకీయాల్లోకి వచ్చారని అన్నారు. ఓడిపోయినా ప్రజల కోసం పవన్ నిలబడ్డారని.. అది గొప్ప రాజకీయనాయకుడి లక్షణమని అన్నారు. పవన్ లో నాయకత్వ లక్షణాలు చాలా ఉన్నాయని వెల్లడించారు.