నితిన్ తో ‘ద్రోణ’, నానితో ‘పిల్ల జమీందార్’, నిఖిల్ తో ‘కళావర్ కింగ్’, మంచు మనోజ్ తో ‘మిస్టర్ నూకయ్య’ వంటి పలు భారీ చిత్రాలు నిర్మించిన ప్రముఖ నిర్మాత డి.ఎస్.రావు తాజాగా లేడి పవర్ స్టార్ రేణు దేశాయ్ తో ‘ఆద్య’ నిర్మిస్తుండడం తెలిసిందే. విజయ దశమి పర్వదినాన పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రం అతి త్వరలో సెట్స్ కి వెళ్లనుంది. నిర్మాతగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూనే… నటుడిగానూ బిజీ అవుతున్నారు డి.ఎస్.రావు. ముఖ్యంగా ప్రతి నాయక పాత్రలు ఆయన్ను వెతుక్కుంటూ వస్తున్నాయి. మధ్య వయసు విలన్ పాత్ర అనగానే ఇప్పుడందరికీ ‘డి.ఎస్.రావు’ టక్కున గుర్తుకు వస్తున్నారు.
ప్రముఖ దర్శకుడు తేజ తొలిసారి డి.ఎస్.రావులోని నటుడిని గుర్తించి, ‘హోరాహోరీ’లో విలన్ గా అవకాశమిచ్చారు. తదుపరి నందినిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన “కళ్యాణవైభోగం”లోనూ ముఖ్య పాత్ర పోషించి మెప్పించిన డి.ఎస్.రావు- నటుడిగా అర్ధ సెచరీకి చేరువలో ఉండడం బట్టి తన జోరును అంచనా వేయవచ్చు. నవంబర్ 10, తన జన్మదినం సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. “నటుడిగా హాఫ్ సెచరీ చేసాను. నిర్మాతగా ఇప్పటికి 20 సినిమాలు తీశాను. నిర్మాతగా కనీసం అర్ధ సెంచరీ కొట్టాలన్నది నా టార్గెట్. ప్రముఖ దర్శకుడు తేజ ప్రోత్సాహంతో నటుడిగా మారాను. తెలుగుతోపాటు కన్నడ, హిందీ భాషల్లోనూ నటిస్తున్నాను. ముఖ్యంగా ఈ బర్త్ డే నాకు చాలా ప్రత్యేకం. నా మిత్రుడు రజనీకాంత్ తో కలిసి… కృష్ణ మామిడాల దర్శకత్వంలో రేణు దేశాయ్ ప్రధాన పాత్రలో నేను నిర్మిస్తున్న “ఆద్య” నిర్మాతగా నాకు మరింత గుర్తింపు తీసుకువస్తుంది. “నిర్మాణం- నటన” రెండు పడవల ప్రయాణం అని నేననుకోను. రెంటినీ జాగ్రత్తగా బ్యాలన్స్ చేసుకుంటూ ముందుకు సాగుతాను” అన్నారు!!