సినిమా టికెట్ రేట్లు ఎంత ఉండాలి? ఈ చర్చ ఇప్పట్లో తేలేది కాదు. ఎందుకంటే పెద్ద సినిమాలకు ఓ రేటు, చిన్న సినిమాలకు ఒక రేటు అని గతంలో ఉండేది. సినిమా రిలీజ్‌కు ముందు ఆ మేరకు ఆ సినిమా టీమ్, ప్రభుత్వంలో సంప్రదించి నిర్ణయం తీసుకునేవారు. అయితే తెలంగాణ ప్రభుత్వం కొన్నేళ్ల క్రితం ఇచ్చిన జీవో కారణంగా గరిష్ఠంగా ఇంత అని ధర వచ్చేసింది. దాంతో నిర్మాతలు వారి ఆలోచనలకు తగ్గట్టు ధరలు పెడుతున్నారు. చిన్న సినిమా అయినా పెద్ద రేటే పెడుతున్నారు.
ఇప్పుడు దీని గురించి చర్చ ఎందుకు అనుకుంటున్నారా? అల్లు శిరీష్ (Allu Sirish) హీరోగా తెరకెక్కిన ‘బడ్డీ’ (Buddy) సినిమాకు తక్కువ ధరలను నిర్ణయిస్తూ టీమ్ ఇటీవల ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. దాని ప్రకారం సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ ధర రూ. 99 కాగా, మల్టీప్లెక్స్‌ల్లో రూ. 125. వీటికి ట్యాక్స్‌లు అదనం అని అంటున్నారు. ఈ నేపథ్యంలో చిన్న సినిమాల టీమ్‌లు అన్నీ ఇలా చేస్తే బాగుండు అనే చర్చ మొదలైంది.
మరిన్ని సినిమా వార్తలు.
ఎక్కువ మంది ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించడమే ధ్యేయంగా ‘బడ్డీ’ టీమ్ ఈ ప్లాన్ చేసింది అని అర్థమవుతోంది. ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఫలితం, ఫుట్ ఫాల్స్ చూశాక మిగిలిన సినిమాల వాళ్లు ఏమన్నా ఆలోచనలు మారుస్తారేమో చూడాలి. అల్లు శిరీష్ కథానాయకుడిగా నటించిన ‘బడ్డీ’ చిత్రంలో గాయత్రి భరద్వాజ్ (Gayatri Bhardwaj), ప్రిషా రాజేశ్ సింగ్ (Prisha Rajesh Singh) హీరోయిన్‌లు. శామ్ ఆంటోన్ (Sam Anton) దర్శకత్వం వహించారు.
స్టూడియో గ్రీన్ ఫిల్మ్స్ బ్యానర్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా (K. E. Gnanavel Raja), అధన జ్ఞానవేల్ రాజా ఈ సినిమాను నిర్మించారు. అడ్వెంచర్, యాక్షన్ ఎంటర్‌టైనర్ జోనర్‌లో రూపొందిన ఈ సినిమా మీద శిరీష్ ఆశలు పెట్టుకున్నాడు. ఈ మేరకు వేసిన ప్రివ్యూ షోలకు మంచి స్పందన వచ్చింది అని చెబుతున్నారు. మరి సినిమా రిలీజ్ అయ్యాక ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.