ఈ మధ్యనే ‘గాడ్ ఫాదర్’ సినిమా రిలీజ్ అయ్యింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ మూవీ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ‘ఆచార్య’ తో ఢీలా పడ్డ మెగా అభిమానులకు ఈ చిత్రం కాస్త జోష్ ఇచ్చిందనే చెప్పాలి. మలయాళంలో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ‘లూసిఫర్’ కు రీమేక్ గా తెరకెక్కింది ఈ చిత్రం. ఒరిజినల్ తో పోలిస్తే ‘గాడ్ ఫాదర్’ లో చాలా మార్పులు చేశాడు దర్శకుడు మోహన్ రాజా. ఆ మార్పులు తెలుగు ప్రేక్షకులకు ఈజీగా డైజెస్ట్ అయ్యేలా ఉన్నాయి.
అలాగే హీరో నిడివిని కూడా పెంచారు.కాకపోతే ఆ మార్పులు హీరో ఎలివేషన్లకు తావిచ్చినట్టు లేవనే చెప్పాలి. ఇదిలా ఉండగా.. ఈ చిత్రంలో దర్శకుడు పూరి జగన్నాథ్ కూడా ఓ చిన్న పాత్ర పోషించాడు. చిరంజీవితో అతనికి కాంబినేషన్ సీన్ కూడా ఉంది. అలా ఈ చిత్రంలో భాగమైన పూరి జగన్నాథ్ తో చిరు ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో సరదా చిట్ చాట్ చేశారు. ‘గాడ్ ఫాదర్’ రిజల్ట్ గురించి మాత్రమే కాకుండా… వీరి గత సినిమాలు నిరాశపరిచిన అంశంపై కూడా స్పందించారు.
ఆ ప్లాపుల నుండి ఎలా బయటపడ్డారు అనే విషయాలను కూడా ముచ్చటించారు. ‘ఆచార్య’ ప్లాప్ నుండి చిరు కోలుకోవడానికి విదేశాలకు ట్రిప్ కు వెళ్లి రిఫ్రెష్ అయ్యి వచ్చినట్లు చెప్పారు. ఈ క్రమంలో ‘లైగర్’ రిజల్ట్ పై కూడా పూరి స్పందించారు. “లైఫ్ లో హీలింగ్ టైమ్ తక్కువ ఉండాలి. యుద్ధాలు జరిగినా, ప్రాణాలు పోయినా హీలింగ్ టైమ్ నెలకు మించి ఎక్కువ ఉండకూడదు. వేరే పనిలో పడిపోవాలి. కొన్నిసార్లు నమ్మిన వాళ్లు కూడా ఫ్లిప్ అవ్వచ్చు, ఏదైనా జరగచ్చు.
నేను ‘లైగర్’ సినిమా తీశాను. మూడేళ్లు ఆ సినిమా కోసం పనిచేస్తూ కష్టపడ్డాను అలాగే ఎంజాయ్ చేశాను. కాస్ట్ అండ్ క్రూ, మైక్ టైసన్ ఇలా అంతా ఎంతో ఆనందంగా గడిచిపోయింది. కానీ, సినిమా ఫ్లాప్ అయ్యింది. వీకెండ్ కే ఆ సినిమా ప్లాప్ అని తేలిపోయింది. అయితే నేను శుక్రవారమే లైగర్ ప్లాప్ అని డిసైడ్ అయిపోయాను.దీంతో సండే జిమ్‌కి వెళ్లాను.. 10 స్కాట్స్ చేశాను.. నా స్ట్రెస్ మొత్తం రిలీజ్ అయిపోయింది. ఇప్పుడు ముంబైలో కొత్త కథలు ప్రిపేర్ చేసుకుంటున్నాను” అంటూ పూరీ జగన్నాథ్ ‘లైగర్’ రిజల్ట్ గురించి చిరుకి తెలిపారు.