సినిమా – టైటిల్ వివాదాలు… ఎన్నో ఏళ్లుగా ఈ రెండింటికీ విడదీయలేని బంధం ఉంది. ఎన్నో సినిమాల విషయంలో టైటిల్స్ క్లాష్ వచ్చింది. లాక్కో లేక పీక్కో లేక నానా ఇబ్బందులు పడి, ఆఖరి టైటిల్ మార్చుకున్నవారు ఉన్నారు. పేరుకు ముందో, వెనుక ఏదో పేరు తగలించి ‘హమ్మయ్య ఈ టైటిల్ మాదే’ అనిపించుకున్నారు. అయితే ఇలాంటి కష్టాలకు కొత్తదారి చూపించారు పూరి జగన్నాథ్. దీన్ని కనుక ఫాలో అయితే టైటిల్ కష్టాలు ఏమంత పెద్ద విషయం కాదనిపిస్తోంది.
పూరి జగన్నాథ్ – విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో ‘జేజీఎం’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఇదేంటి పబ్‌జీ ఆట కొత్తే పేరు ‘బీజీఐఎం’లా ఉంది అనుకుంటున్నారా. అలా పెట్టారు లెండి పూరి జగన్నాథ్. జేజీఎం అంటే జన.. గణ.. మన అని అర్థం. పూర్తి పేరు పెట్టేయకుండా ఇలా షార్ట్ ఫామ్‌లో ఎందుకు అని డౌట్ పడుతున్నారు. దీని వెనుక పెద్ద కథే ఉంది. నిజానికి ఈ సినిమా ఆలోచన ఇప్పటికి కాదు. పూరి జగన్నాథ్ కలల ప్రాజెక్ట్ ఈ సినిమా అని చెప్పొచ్చు.
చాలా కాలంలగా ఈ సినిమా చేస్తామంటున్నారు. మహేష్‌బాబుతో ఈ సినిమా చేద్దామని అనుకున్నారు కూడా. కానీ ఆ ప్లాన్స్ ఆగిపోయాయి. ఇప్పుడు మహేష్ ఫ్యాన్ విజయ్ దేవరకొండతో చేస్తున్నారు. ఇటీవల ఘనంగా అనౌన్స్ చేశారు. అయితే ఈ అనౌన్స్‌మెంట్‌కి ముందు ఓ విషయం బయటికొచ్చింది. అదే ‘జనగణమన’ పేరుతో ఆల్‌రెడీ మలయాళంలో ఓ సినిమా స్టార్ట్ అయ్యిందని, విడుదలకు సిద్ధమవుతోంది. అలాగే తమిళంలో జయం రవి ‘జన గణ మన’ అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో తాప్సి కథానాయిక. ఈ సినిమాను రెండు నెలల్లో విడుదల చేస్తారని టాక్.
పూరి జగన్నాథేమో తన సినిమాను పాన్ ఇండియా లెవల్‌లో రిలీజ్ చేద్దామని చూస్తున్నాడు. దీంతో టైటిల్ సమస్య వచ్చింది. ఈ క్రమంలో పూరి టైటిల్ మార్చాల్సిందే అని అనుకున్నారు. కానీ పూరి జగన్నాథ్ కొత్తగా ఆలోచించాడు. తన సినిమా టైటిల్‌కు షార్ట్‌ఫామ్‌ను టైటిల్‌గా పెట్టి.. బ్యాగ్రౌండ్‌లో జన గణ మన అని వాయిస్ పెట్టేశాడు. దీంతో టైటిల్ మార్చినా.. కొత్త టైటిల్ లానే ఉంది. అంతేకాదు భవిష్యత్తులో ఇండస్ట్రీలో ఇలాంటి టైటిల్ సమస్యలు వచ్చినప్పుడు చాలామంది తనను ఫాలో అయ్యేలా కొత్తదారి చూపించాడు.