మీడియా తన జీవితాన్ని నాశనం చేసిందని దర్శకుడు పూరి జగన్నాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. తనతో పాటు అనేక మంది జీవితాలను మీడియా వారు వీధిన పడేశారని ఆగ్రహించారు. డ్రగ్స్ కేసులో భాగంగా నిన్న సిట్ ముందుకు పూరి జగన్నాథ్ వెళ్లారు. పోలీసుల విచారణ ఎదుర్కొన్నారు. ఈ సమయంలో మీడియాలో వచ్చిన కథనాలను తెలుసుకున్న ఆయన తన బాధని ఓ వీడియో రూపంలో బయటపెట్టారు. ఆ వీడియోలో పూరీ మాట్లాడుతూ “సిట్ విచారణకు వెళ్లాను. వారికి పూర్తిగా సహకరించాను. కెల్విన్ తో నాకు పరిచయం లేదని, వాళ్ళ ముఠాతో నాకు సంబంధం లేదని చెప్పాను. వాళ్ళు (పోలీసులు) ఎప్పుడు పిలిచినా వెళ్లి కలవడానికి రెడీగా ఉన్నాను.
సమాజంలో నేను బాధ్యత కలిగిన వ్యక్తిని, డ్రగ్స్ మాత్రమే కాదు ఎటువంటి చెడు అలవాట్లజోలికి వెళ్లను. ప్రోత్సహించను. పోలీసులు, మీడియా అంటే నాకెంతో ఇష్టం. పోలీసులపై నేను ఎన్నో సినిమాలు తీశాను. జర్నలిస్టుల కోసం ఇజం సినిమా తీశాను.” అని వెల్లడించారు. మీడియాలో ఉన్న చాలామంది తనకి మిత్రులని, వారితో కలిసి టీ కూడా తాగుతుంటానని తెలిపారు. అటువంటి వారు తనపై రేటింగ్స్ కోసం కట్టు కథలు అల్లి ప్రోగ్రామ్స్ చేశారని.. వాటి వల్ల తన కుటుంబం బాధతో కుమిలిపోతోందని పూరీ చెప్పారు. మంచి, చెడు ఏదైనా సిట్ డిసైడ్ చేస్తుందని అన్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.