నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ అల్లు అర్జున్ (Allu Arjun) టైటిల్ పాత్రలో నటించగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “పుష్ప 2” (Pushpa 2: The Rule). ఇండియా వైడ్ వైల్డ్ ఫైర్ క్రియేట్ చేసిన ఈ చిత్రం నేడు (డిసెంబర్ 05) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. “బాహుబలి 2” తర్వాత ఆస్థాయి ఆసక్తి రేకెత్తించిన సీక్వెల్ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఆ అంచనాలను సుకుమార్ & అల్లు అర్జున్ (Allu Arjun) కలిసి అందుకోగలిగారా? సినిమా ఆడియన్స్ ను ఏమేరకు అలరించింది? అనేది చూద్దాం..!!
కథ: ఎర్ర చందనం స్మగ్లింగ్ గ్రూప్ సిండికేట్ కు లీడర్ గా మారిన పుష్పరాజ్ (అల్లు అర్జున్) (Allu Arjun) పంతానికి పోయి షెకావత్ (ఫహాద్ ఫాజిల్)తో మాత్రం ఏదో ఒక విధంగా ఢీ కొడుతూనే ఉంటాడు.
ఓ రోజు ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్లగా.. అక్కడ స్మగ్లర్ తో ఫోటో దిగితే పరువు పోతుంది అని భావించిన ముఖ్యమంత్రి పుష్పరాజ్ ను మాటలతో అవమానిస్తాడు.
దాంతో మరోసారి పుష్పరాజ్ ఈగో దెబ్బ తింటుంది. దాంతో ఓ కటువైన నిర్ణయం తీసుకుంటాడు పుష్పరాజ్.
పుష్ప తీసుకున్న ఆ నిర్ణయం ఏమిటి? దాని కారణంగా ఎదుర్కొన్న సమస్యలేమిటి? షెకావత్ ను ఎలా ఎదుర్కొన్నాడు? తన జన్మ హక్కైన ఇంటి పేరును ఎలా సాధించుకున్నాడు? వంటి ప్రశ్నలకు సమాధానమే “పుష్ప 2” (Pushpa 2: The Rule) కథాంశం.
నటీనటుల పనితీరు: అల్లు అర్జున్ (Allu Arjun) నటుడిగా “పుష్ప”తోనే నేషనల్ అవార్డ్ అందుకున్నాడు కానీ.. నిజానికి “పుష్ప 2”(Pushpa 2: The Rule)లో నటనకి ఇంకా పెద్ద అవార్డ్ ఇవ్వాలి. పుష్పరాజ్ పాత్రలోని కసి, ఆ పాత్ర తాలుకు స్వభావాన్ని పుణికిపుచ్చుకొన్నట్లుగా పూనకంతో ఊగిపోయాడు అల్లు అర్జున్ (Allu Arjun) . ముఖ్యంగా జాతర సీక్వెన్స్ లో కన్నీరు పెట్టుకుంటూ “నాకు ఆడబిడ్డ పుట్టాలని కోరుకున్నాను” అనే సీన్ లో అల్లు అర్జున్ (Allu Arjun) లోని పూర్తిస్థాయి నటుడు బయటపడ్డాడు. ఇక అదే జాతర సీక్వెన్స్ లో వచ్చే అమ్మోరు తల్లి పాట మరియు ఓల్డ్ ఫోర్ట్ సీక్వెన్స్ లో అల్లు అర్జున్ రుద్రతాండవడం అనేది కొన్నేళ్లపాటు చెప్పుకొనే స్థాయిలో ఉంది.
నటుడిగా అల్లు అర్జున్ (Allu Arjun) ని మరో స్థాయికి తీసుకెళ్ళే చిత్రమిది. ముఖ్యంగా బీహార్ మార్కెట్ లో బన్నీకి తిరుగులేని స్టార్ డమ్ క్రియేట్ చేయడమే కాక నార్త్ లో బన్నీకి చిరకాలం గుర్తుండిపోయే పేరు తీసుకొస్తుంది ఈ చిత్రం. సినిమా మొత్తం పుష్పరాజ్ గాడి కసి కనిపిస్తుంది, ఆ కసితోనే ప్రేక్షకుడు సినిమా చూస్తుంటాడు. ఒక నటుడిగా అల్లు అర్జున్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ కి ఇదే నిదర్శనం.
సాధారణంగా ఈ తరహా మాస్ ఎంటర్టైనర్స్ లో హీరోయిన్స్ కి పాటలు మినహా పెద్ద రోల్ ఏమీ ఉండదు. కానీ.. ఈ చిత్రంలో రష్మిక పోషించిన శ్రీవల్లి పాత్ర చేసే మోటు సరసం కాస్త ఇబ్బందిపెట్టినా.. భర్తను ఒక్క మాట అన్నా ఊరుకోని సగటు గృహిణిగా ఆమె పాత్ర స్వభావం కానీ, రష్మిక నటన కానీ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇక పీలింగ్స్ పాటలో రష్మిక ఊరమాస్ డ్యాన్స్ స్టెప్స్ కి బాల్కనీ ఆడియన్స్ కూడా ఊగాల్సిందే.
ఫహాద్ ఫాజిల్ కి ఈసారి కాస్త స్క్రీన్ టైమ్ ఎక్కువ లభించింది. అయితే.. అతడి క్యాలిబర్ ను పూర్తిస్థాయిలో వినియోగించుకోలేదు అనిపిస్తుంది. స్విమింగ్ పూల్ సీన్ & వైల్డ్ ఫైరు సీక్వెన్స్ లో అతడ్ని మరీ కమెడియన్ లా చూపించేయడంతో.. పుష్పరాజ్ గాడ్ని బలంగా ఢీకొనే ప్రతినాయకుడు లేకుండాపోయాడు.
ఫస్ట్ పార్ట్ లో చాలా పవర్ ఫుల్ గా చూపించిన సునీల్ ను సెకండ్ పార్ట్ లో కమెడియన్ చేసేశారు.
రావు రమేష్ మరోసారి తన సత్తాను ఘనంగా చాటుకున్నాడు. పోలీస్ స్టేషన్ సీన్ లో అతడి పెక్యులియర్ యాక్టింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
జగపతిబాబు పాత్రను పూర్తిగా పరిచయం చేయలేదు కానీ.. అసలు మెయిన్ విలన్ కోగటం వీరప్రతాప్ పాత్ర అని మాత్రం అర్థమవుతుంది. ఈ వీరప్రతాప్ ఏం చేస్తాడు అనేది తెలియాలంటే మూడో భాగం కోసం వెయిట్ చేయాలన్నమాట.
ఇక అజయ్ మొదట్లో కోపిష్టి అన్నయ్యగా మాత్రమే కనిపించినా.. చివర్లో పండించే సెంటిమెంట్ సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది.
తారక్ పొన్నప్ప పాత్ర చిన్నదే కానీ.. దాని ఇంపాక్ట్ మాత్రం గట్టిగా ఉంది. ఇక శ్రీలీల స్పెషల్ సాంగ్ లో కైపెక్కించే డ్యాన్స్ మూమెంట్స్ తో కుర్రకారును కళ్లు తిప్పుకోనివ్వకుండా చేసింది.
సాంకేతికవర్గం పనితీరు: “పుష్ప” సమస్య మొదటి నుంచి పోలీస్ ఆఫీసర్ షెకావత్ కాదు, సిండికేట్ హెడ్ మంగళం సీను కాదు, అతడి భార్య దాక్షాయణి అంతకన్నా కాదు. పుష్ప గాడి అసలు సమస్య తన సవతి సోదరుడు మోహన్ రాజ్ (అజయ్) తన నుంచి లాక్కున్న ఇంటిపేరు. ఈ సమస్యను సుకుమార్ ఎలా డీల్ చేస్తాడు అనేదే అన్నిటికంటే ఆసక్తికరమైన విషయం. అక్కడే సుకుమార్ తన మార్క్ ను చూపించుకున్నాడు. జాతర సీక్వెన్స్ లో పుష్పరాజ్ కి ఇంటిపేరు అనేది ఎంత ముఖ్యమో, అది లేకపోవడం వల్ల ఎంత బాధపడుతున్నాడు అనేది ఎస్టాబ్లిష్ చేసి.. ఫోర్ట్ ఫైట్ అనంతరం దానికి సమాధానం చెప్పిన విధానం సినిమాకి మెయిన్ హైలైట్. ముఖ్యంగా ఓ బడా మాస్ హీరో చేత కన్నీళ్లు పెట్టుకునేలా చేయడం, ఆ బాధను ఆడియన్స్ కూడా అనుభవించేలా చేయగల డ్రామాను క్రియేట్ చేయడంలో దర్శకుడిగా, రచయితగా సుకుమార్ ఘన విజయం సాధించాడు. ఎప్పుడైతే తెర మీద “ముల్లేటి పుష్పరాజ్” అని కనిపిస్తుందో.. ప్రతి ఒక్క ప్రేక్షకుడు “సాధించాడురా పుష్ప గాడు” అనుకుని తీరతాడు.
ఇంతకంటే విజయం ఒక దర్శకుడికి ఉండదు. ఇక పుష్ప వెర్సెస్ షెకావత్ సీన్ ను ఎగ్జిక్యూట్ చేసిన విధానం, ఎర్ర చందనం స్మగ్లింగ్ ను డీల్ చేసిన విధానం సుకుమార్ బ్రిలియన్స్ కు పరాకష్టగా నిలుస్తాయి. అయితే.. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం సుకుమార్ లోని దర్శకుడి కంటే రచయితకే ఎక్కువ మార్కులు వేయాలి. “ఇంటిపేరు” సీక్వెన్స్ ను అంతబాగా రాశాడు మరి. దర్శకుడిగా ఎక్కడ మార్కులు తగ్గుతాయంటే.. “సూసేకి” పాటను ప్లేస్ చేసిన విధానం, అసలు జపాన్ ఎందుకు వెళ్ళాడో కనీసం క్లూ ఇవ్వకుండా ముగించడం, పార్ట్ 3 కి మంచి హింట్ ఇచ్చినా.. ఆడియన్స్ ను హుక్ చేసే స్థాయి డీటెయిల్ లేకపోవడం వంటివి కారణాలుగా చెప్పవచ్చు. అయితే.. ఈ లాజిక్కులు పక్కన పెట్టేస్తే “పుష్పరాజ్” గాడి ర్యాపేజ్ ను మాస్ ఆడియన్స్ ను ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తారు.
కుబా సినిమాటోగ్రఫీ వర్క్ క్రేజీ అని చెప్పాలి. ఫోర్ట్ ఫైట్ సీక్వెన్స్ & సెకండాఫ్ మొదట్లో వచ్చే లారీ ఛేజింగ్ సీక్వెన్స్ ను భలే ఎగ్జిక్యూట్ చేశాడు. ఫైట్స్ సీన్స్ విషయంలో డ్రాగన్ ప్రకాష్ ను కూడా మెచ్చుకోవాలి. లాజిక్స్ ను ఆడియన్స్ కన్సిడర్ చేయకుండా చేతులు, కాళ్లు కట్టేసినా పుష్ప చేసే మారణహోమాన్ని మాస్ ఆడియన్స్ అద్భుతంగా ఎంజాయ్ చేస్తారు.
ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ బాగుంది. సుకుమార్ లోని రచయిత ఎడిటర్ కు పూర్తి స్వేచ్ఛ ఇవ్వలేదని అర్థమవుతుంది.
దేవిశ్రీప్రసాద్ పాటలు ఆల్రెడీ బ్లాక్ బస్టర్ కాగా, నేపథ్య సంగీతంతో తన సత్తా చాటుకున్నాడు. అలాగే.. అడిషనల్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందించిన సామ్ సి.ఎస్ కూడా జాతర సీక్వెన్స్ కు ఇచ్చిన బిజీయం మూడ్ ను భలే ఎలివేట్ చేసింది.
నిర్మాతలు సుకుమార్ ను బలంగా నమ్మి ఎంత కావాలంటే అంత ఖర్చు చేశారు. కొన్ని చోట్ల అవసరమైన దానికంటే ఎక్కువ ఖర్చే కనిపిస్తుంది. అయితే.. వాళ్ల కష్టానికి ప్రతిఫలం కలెక్షన్స్ రూపంలో రెండు వారాల్లో వచ్చేస్తుంది అనుకోండి.
విశ్లేషణ: అల్లు అర్జున్ లోని నటుడ్ని పూర్తిస్థాయిలో పరిచయం చేసిన ఘనత సుకుమార్ కే దక్కుతుంది. ఆ నట విశ్వరూపం చూడడం కోసమే “పుష్ప 2”నీ థియేటర్లలో ఓ రెండుమూడు సార్లయినా చూడొచ్చు. ఇక సుకుమార్ మార్క్ ఎమోషన్స్ & ఎలివేషన్స్ అన్నీ బోనస్ అన్నమాట. పుష్ప గాడి మాస్ థియేటర్లలో కనీసం నాలుగు వారాల పాటు రచ్చ చేయడం ఖాయం. ముఖ్యంగా నార్త్ మార్కెట్లో ఈ సినిమా క్రియేట్ చేసే సెన్సేషన్ మాములుగా ఉండదు.
పార్ట్ 3 ది ర్యాపేంజ్ ను కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేసారు కాబట్టి, ఆ సినిమా ఎప్పుడొచ్చినా సరికొత్త ఇండియన్ రికార్డ్స్ క్రియేట్ చేయడం ఖాయం. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ బ్రాండ్ అనేది మరో స్థాయికి వెళ్ళిపోవడం ఖాయం. ఇక సినిమా కలెక్షన్స్ ఏమిటి అనేది చిత్రబృందం విడుదల చేసే పోస్టర్లు చూసి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉంటాం.
అయితే.. “పుష్ప2” అనే సినిమా మాత్రం కలెక్షన్స్ కు అతీతం. ఎందుకంటే.. ఈ సినిమాకి రావాల్సింది కలెక్షన్స్ మాత్రమే కాదు.. నటుడిగా అల్లు అర్జున్ కి రెస్పెక్ట్ & రచయితగా సుకుమార్ శైలికి ప్రఖ్యాతులు.
ఫోకస్ పాయింట్: ఇది వైల్డ్ ఫైర్ కాదు.. వరల్డ్ వైడ్ ర్యాపేంజ్!
రేటింగ్: 3.5/5