అల్లు అర్జున్ (Allu Arjun) నటిస్తున్న ‘పుష్ప 2: ది రూల్’ (Pushpa 2) సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాల మధ్య డిసెంబర్‌లో విడుదలకు సిద్ధమవుతోంది. సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే ప్రేక్షకులలో అంచనాలను మరింతగా పెంచింది. పుష్ప: ది రైజ్ (Pushpa) సెన్సేషన్ తర్వాత, ఈ సినిమాపై ఉన్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని, టికెట్ ధరల విషయంలోనూ ప్రత్యేక ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. తెలంగాణలో భారీ బడ్జెట్ సినిమాలకు అడిగినంత టికెట్ ధరలు పెరగడం సర్వ సాధారణం.
Pushpa 2
అయితే, ఆంధ్రప్రదేశ్‌లో సింగిల్ స్క్రీన్లలో కూడా టికెట్ ధరలను పెంచే చర్చలు జరగడం ఆసక్తి రేపుతోంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాకి టికెట్ ధర 300 రూపాయల వరకు ఉండేలా ప్రతిపాదన చేయనున్నట్లు సమాచారం. ఇది పాన్ ఇండియా సినిమాలకు ఆంధ్రప్రదేశ్‌లో చరిత్రలోనే అత్యధిక రేటు కావొచ్చని చెబుతున్నారు. ‘పుష్ప 2’ కోసం తగిన విధంగా టికెట్ ధర పెంచితే, డిస్ట్రిబ్యూటర్లు నష్టాలను తగ్గించుకునే అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారు.
గతంలో ‘పుష్ప 1’ విషయంలో సరైన రేటు లభించక నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు సతమతమయ్యారు. అందుకే ఈసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ప్రత్యేకంగా చర్చలు జరుపుతున్నారని సమాచారం. అయితే గతంలో ‘దేవర’(Devara) కి 250 రూపాయల వరకు అనుమతించిన రేటు ఈసారి 300కు చేరుతుందా అన్నది చర్చనీయాంశమైంది. ఇక ట్రైలర్ విడుదల తర్వాత సినిమా పై ఆసక్తి మరింతగా పెరిగింది. అందులోని యాక్షన్ సీక్వెన్స్‌లు, అల్లు అర్జున్ మేకోవర్, దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సంగీతం సినిమాకి అదనపు ఆకర్షణగా నిలుస్తున్నాయి.
వీకెండ్‌కు అధిక ధరలు, ఆ తర్వాత తగ్గింపు వంటి ప్రణాళికలు ఉంటే కలెక్షన్లపై ప్రభావం ఎక్కువగా ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. పెద్ద సినిమాలకు టికెట్ ధరలు పెరగడం సాధారణమే అయినా, 300 రూపాయల వరకు రేటు పెంచడం అరుదు. ఈ విషయం సామాన్య ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగిస్తోంది. టికెట్ ధరల పెంపు సినిమాకు లాభదాయకం అవుతుందా లేదా అన్నది సినిమా విడుదల తర్వాతే తెలుస్తుంది.