చారాణా కోడికి బారాణా మసాలా అనే సామెత తెలుసా? అంటే కోడి విలువ కంటే దానికి వేసే మసాలా విలువే ఎక్కువ అని. అంటే లాభం లేని వ్యాపారం లేదా వంట అని చెప్పొచ్చు. ఈ మాటలు ప్రస్తుతం టాలీవుడ్‌లో ఓ సినిమా బాగా సరిపోతాయి అంటున్నారు. అదేదో కాదు ఇటీవల ఏడాది పూర్తి చేసుకున్న ‘పుష్ప: ది రైజ్’ గురించే. అదేంటి సినిమాకు బాగా వసూళ్లు వచ్చాయి కదా అంటారా? అవును మీరు చెప్పింది కరెక్టే. అయితే మేం అంటున్నది అప్పటి వసూళ్ల గురించి కాదు. ఇప్పటి వసూళ్ల గురించింది.
‘పుష్ప’ టీమ్ అంతా కలసి ఇటీవల రష్యా వెళ్లిన విషయం తెలిసిందే. సినిమాను అక్కడ ఘనంగా విడుదల చేద్దామని మెయిన్ టీమ్ అంతా వెళ్లి ప్రచారం చేశారు. దీని కోసం భారీగా ఖర్చు పెట్టారని సమాచారం. ఇన్ని కోట్లు, అన్ని కోట్లు అని లెక్కలు బయటకు వస్తున్నా.. అవేవీ నమ్మకంగా చెప్పలేం. అయితే పెట్టిన ప్రచారం ఖర్చు కూడా అక్కడ థియేటర్ల నుండి రావడం లేదు అనేది లేటెస్ట్ టాక్.
సింపుల్‌గా చెప్పాలంటే ‘పుష్ప’రాజ్‌ను రష్యాలో అందరూ ఫ్లవరే అనుకుంటున్నారట, ఫైర్ అని అనుకోవడం లేదట. దీంతో వసూళ్ల విషయంలో సినిమాకు ఎలాంటి ప్రభావం చూపించలేకపోతోందట. సినిమా విడుదలై వారం దాటినా చిత్రబృందం నుండి వసూళ్ల విషయంలో ఎలాంటి పాజిటివ్ స్పందన లేదు. టీమ్ బాగా తిరిగింది అనే మాటలు తప్ప, సినిమా ఇంత వసూళ్లు సాధించింది అనే మాట ఎక్కడా వినిపించడం లేదు.
ఓవైపు జపాన్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా అదిరిపోయే వసూళ్లు సాధిస్తూ రికార్డులు సాధించిన నేపథ్యంలో రష్యాలో సత్తా చాటుతాం అని ‘పుష్ప’ టీమ్ అనుకుంది. కానీ ఆ సూచనలు ఏవీ కనిపించలేదు. దీంతో టీమ్ కామ్ అయిపోయింది అని అంటున్నారు. రెగ్యులర్‌గా మన తెలుగు సినిమాలు బాగా ఆడే అమెరికాలోనే ‘పుష్ప’ సినిమా ఆశించిన వసూళ్లు సాధించలేదు. ఇక రష్యాలో సినిమా బాగా ఆడకపోవడంతో వింతేమీ లేదు అనే వాళ్లూ ఉన్నారు.