2018 లో బ్లాక్ బస్టర్లు అందుకున్న కొందరు దర్శకులు.. ఆ తరువాతి సినిమాని పట్టాలెక్కించడంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ‘గీత గోవిందం’ దర్శకుడు పరశురామ్(బుజ్జి), ‘భరత్ అనే నేను’ దర్శకుడు కొరటాల శివ, ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్, ‘రంగస్థలం’ దర్శకుడు సుకుమార్, ‘ఆర్.ఎక్స్.100’ దర్శకుడు అజయ్ భూపతి.. వంటి వారి నుండీ ఇప్పటి వరకూ మరో సినిమా రాలేదు. అయితే అందరూ పెద్ద ప్రాజెక్టులే తెరకెక్కించబోతున్నారు. సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే..
‘రంగస్థలం’ తరువాత దర్శకుడు సుకుమార్ ‘పుష్ప’ చిత్రాన్ని తెరకెక్కించాలి అని ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అల్లు అర్జున్ హీరోగా నటించబోతున్న ఈ పాన్ ఇండియా మూవీకి ఎక్కడ లేని ఇబ్బందులు వస్తుండడం గమనార్హం. ఈమధ్యనే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ మొదలైంది. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రం షూటింగ్ మళ్ళీ ఆగిపోయిందట. అందుకు ప్రధాన కారణం .. ‘పుష్ప’ యూనిట్ సభ్యుల్లో కొందరికి కరోనా సోకడమే అని తెలుస్తుంది.
అంతేకాకుండా ఒకరు చనిపోయినట్టు కూడా తెలుస్తుంది. అయితే చనిపోయిన తరువాతే ఆ వ్యక్తికి కరోనా ఉన్నట్టు తేలిందట. దీంతో సుకుమార్, అల్లు అర్జున్ తో పాటు మరికొందరు హోమ్ ఐసోలేషన్ కు వెళ్లిపోయారట. కొన్ని నెలల వరకూ ఈ చిత్రం షూటింగ్ తిరిగి ప్రారంభమయ్యే అవకాశం లేదని ఇన్సైడ్ టాక్.