ఒక సినిమా హిట్ అయితే… ఆ తర్వాత దర్శకులు అలాంటి కథలో, వాటికి దగ్గరగా ఉండే కథల్నో ట్రై చేస్తుంటారు అంటారు. గతంలో ఈ మాట మనం చాలామంది దర్శకుల మాటల్లో విన్నాం కూడా. అయితే ఒక సినిమా హిట్ అయితే దానికి తగ్గట్టుగా సినిమా బిజినెస్‌ను మార్చుకుంటారా? ఇంతవరకు ఇలాంటి విషయాల్లో మనకు పెద్దగా పరిచయం లేదు కానీ. ఇప్పుడు ‘పుష్ప: ది రూల్’ గురించి వినిపిస్తున్న పుకార్లు చూస్తే అవును అనాలనే అనిపిస్తోంది.
‘పుష్ప: ది రూల్’ సినిమా విడుదలకు ఇంకా ఏడు నెలలకుపైగా సమయం ఉంది. అయితే ఇప్పుడు టీమ్ మార్కెటింగ్ షురూ చేస్తోందట. అది కూడా మామూలుగా కాదు… భారీ లెవల్‌లో. తెలుగుతోపాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే అక్కడ తొలి ‘పుష్ప’ విడుదలైన రేంజి కంటే డబుల్, ట్రిపుల్ ఉండేలా చూసుకుంటున్నారట. ఆ లెక్కలోనే మార్కెటింగ్ చేస్తున్నారట. ఒక్కో భాషలో భారీ ఫిగర్స్ వస్తాయంటున్నారు.
దీనంతటి కారణం ఇటీవల ఇండియన్ సినిమాలో వచ్చిన రెండు బ్లాక్‌బస్టర్లే అని చెప్పాలి. రణ్‌బీర్ కపూర్ – సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వచ్చిన ‘యానిమల్’ ఆ రెండింటిలో ఒకటైతే… ఆ రెండోది ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వచ్చిన ‘సలార్: సీజ్ ఫైర్’. ఈ రెండు సినిమాలకు కోట్లాభిషేకం జరుగుతుండటం, అంతకుముందు ‘పుష్ప: ది రైజ్’కి వచ్చిన వసూళ్లు లెక్క చూసుకొని రెండో ‘పుష్ప’ (Pushpa2) రైట్స్ కోసం భారీ ధరను ఫిక్స్ చేసే యోచనలో మైత్రీ మూవీ మేకర్స్ టీమ్ ఉందని టాలీవుడ్ వర్గాల భోగట్టా.
ఆగస్టు 15న ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో కనీసం నెల రోజుల ముందు నుండే దేశవ్యాప్తంగా ప్రచారం చేయాలని అనుకుంటున్నారట. అందుకే జూన్ ఎండింగ్ నాటికే ఈ అమ్మకాలు, పంపకాలు జరిపేసి, ప్రచారానికి మొత్తం దళాన్ని సిద్ధం చేయాలని సుకుమార్ అనుకుంటున్నారట. మరి ఏ మేరకు ప్లాన్స్ వర్కవుట్ అవుతాయో చూడాలి.