నటుడిగా, దర్శకుడిగా సినిమా రంగంలో ఆర్.నారాయణమూర్తి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. తను నమ్మిన సిద్ధాంతాలతో నారాయణమూర్తి సినిమాలను తెరకెక్కించడంతో పాటు ఆ సినిమాలలో నటించారు. కమర్షియల్ సినిమాలలో ఆఫర్లు వచ్చినా ఆ ఆఫర్లను నారాయణమూర్తి సున్నితంగా రిజెక్ట్ చేశారు. సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన నారాయణమూర్తి కాలేజ్ లో విద్యార్థి సంఘానికి అధ్యక్షునిగా పని చేశారు. 18 ఏళ్ల వయస్సులో సినిమాల్లో నటుడు కావాలనే ఆశతో నారాయణమూర్తి ప్రయత్నాలు మొదలుపెట్టారు.
తిండి, వసతి లేకపోవడంతో మద్రాస్ లో ఆయన ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. సీనియర్ ఎన్టీఆర్ ను చూసి తను కూడా బీఏ చేయాలని నారాయణమూర్తి భావించారు. హీరోగా నిలదొక్కుకోవాలంటే మొదట డైరెక్టర్ గా నిలదొక్కుకోవాలని నారాయణమూర్తి అనుకున్నారు. స్నేహితుల సాయంతో అర్ధరాత్రి స్వాతంత్రం అనే సినిమాను నారాయణమూర్తి తెరకెక్కించడంతో పాటు నిర్మించారు. సమకాలీన సామాజిక అంశాలతో నారాయణమూర్తి ఎక్కువగా సినిమాలను తెరకెక్కించడం గమనార్హం. నారాయణమూర్తికి సొంతంగా ఇళ్లు, కార్లు లేవు.
పలు రాజకీయ పార్టీలు ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు పోటీ చేసే ఛాన్స్ ఇచ్చినా ఆయన ఆసక్తి చూపలేదు. అయితే ఆర్.నారాయణమూర్తి తన భూమి అయిన 12 ఎకరాల భూమిని కూడా దానం చేశారని సమాచారం. నారాయణమూర్తి తల్లి ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. తన కొడుకు ఉన్నది పంచి పెడుతున్నాడని హైదరాబాద్ లో ఇల్లు కట్టుకోవాలని సూచించినా వినలేదని నారాయణమూర్తి తల్లి చెప్పుకొచ్చారు. తన కొడుకుకు చేపల పులుసు, గోంగూర పచ్చడి అంటే ఎంతో ఇష్టమని ఆమె తెలిపారు.
తన కోరిక ప్రకారం కొడుకు ఊళ్లలో ఆలయాలు కట్టించాడని ఆమె చెప్పుకొచ్చారు. నారాయణమూర్తి మంచితనం గురించి తెలిసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఎన్ని మంచి పనులు చేసినా ఆ మంచి పనుల గురించి పబ్లిసిటీ చేసుకోవడానికి కూడా నారాయణమూర్తి ఇష్టపడరు. ఏపీ టికెట్ రేట్ల సమస్య పరిష్కారం దిశగా కూడా నారాయణమూర్తి అడుగులు వేసిన సంగతి తెలిసిందే.