తెలుగు సినిమా గర్వించదగ్గ దర్శకులలో కె.రాఘవేంద్ర రావు ఒకరు. వయసు పైబడుతున్న ఆయన సినిమాలు మాత్రం నిత్య యవ్వనంగా ఉంటాయి. శతాధిక చిత్రాల దర్శకుడైన రాఘవేంద్ర రావు మాస్, క్లాస్, భక్తి రస చిత్రాలతో మెప్పిస్తూ వస్తున్నారు. అయితే ఆయనకీ ఓ కలలా మిగిలిపోయిన విషయమొకటుంది. అదే మహా భారతానికి తెరరూపం ఇవ్వాలని. దర్శకేంద్రుడితోపాటు ఆయన శిష్యరికం చేసిన నేటి దర్శకధీరుడు గురి కూడా దానిమీదే వుంది.
అయితే “మహాభారతం” సినిమాగా రావాలంటే కనీసం అయిదు భాగాలుగా చేయాలనీ సమయం కూడా ఏళ్లకు ఏళ్ళు పడుతుందని ఇరువురూ చెప్పారు. ఈ తరహా సినిమాలు ఒక్కసారే సాధ్యం. మరోవైపు ఇంత పెద్ద సినిమా చేయాలంటే దర్శకుడి పైన భారం ఎక్కువగా పడుతుంది. అంచేత ఇద్దరూ కలిసి ఈ సినిమా చేస్తే ఎలా ఉంటుంది అన్న దిశగా కూడా చర్చలు జరుగుతున్నాయట. మరోముఖ్య విషయమేమిటంటే ఈ ఇద్దరికీ ఇప్పుడు కావాల్సిన హీరో ఎన్టీఆర్. ఇదీ గురు శిష్యులు కలిసేందుకు బలం చేకూరుస్తుంది. ఎటూ బాహుబలి చిత్రీకరణ తుది దశకు చేరుకుంది కాన ‘భారతం’పైనా త్వరలో ఓ క్లారిటీ వచ్చే అవకాశం వుంది.