ఏ క్షణాన రాజమౌళిని… ఎన్టీఆర్ జక్కన్న అని పిలిచాడో కానీ… అప్పటి నుండి సినిమా ప్రపంచం అంతా ఆయన్ని జక్కన్న అనే పిలుస్తున్నారు. అందుకే ఎక్కడకు వెళ్లినా జక్కన్న అంటున్నారు. ఆయన తీసిన సినిమాలను శిల్పాలతో పోలుస్తున్నారు. అయితే రాజమౌళి ఇంట్లో వాళ్లు నంది అని పిలుస్తుంటారు. అలా ఎందుకు పిలుస్తారు, ఆ పేరు వెనుక ఉన్న విషయమేంటి, అసలు ఆ పేరు ఆయనకు పెట్టిందెవరు? అంతకుముందు ఏమని పేరు ఉండేదో తెలుసా?
బాలకృష్ణ హోస్ట్‌గా… ‘ఆహా’లో అన్‌స్టాపబుల్ అనే షో రన్ అవుతున్న విషయం తెలిసిందే. ఇందులో రాజమౌళి, కీరవాణి వచ్చారు. ఈ సందర్భంగా చాలా విషయాలు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ‘నంది’ అనే ముద్దు పేరు గురించి రాజమౌళిని బాలయ్య అడిగారు. దానికి ఆయన సమాధానం చెబుతూ చిన్నతనంలో తనకు పెట్టిన ముద్దు పేరు గురించి కూడా మాట్లాడారు. చిన్నప్పుడు రాజమౌళికి కుటుంబ సభ్యులు బంటి అనే పేరు పెట్టారట. అయితే ఆ పేరుతో ఆయన ఇబ్బందులు ఎదుర్కొన్నారట.
తన చిన్ననాటి స్నేహితులు కొందరు రాజమౌళిని… బంటి అని కాకుండా ఎలుగుబంటి అని పిలిచేవారట. దీంతో ఇబ్బందిగా అనిపించి రాజమౌళి తన ముద్దు పేరు మార్చుకోవాలని నిర్ణయించారట. అలా ఏ పేరు బాగుంటుందా అని అనుకొని ఆఖరికి నంది అనే పేరు పెట్టారట. అప్పటి నుండి ఇంట్లో అందరూ రాజమౌళిని నంది అని పిలవడం మొదలెట్టారట. ఈ షోలో బాలయ్య కూడా అలానే పిలిచారు. ఇకపై అలానే పిలుస్తా అని కూడా చెప్పారు. అదన్నమాట రాజమౌళి ముద్దు పేరు సంగతి.
ఆ తర్వాత రాజమౌళి గెడ్డం గురించి కూడా చర్చ వచ్చింది. అంతేసి గడ్డం ఎందుకు పెంచుతున్నారని అడిగారు బాలయ్య. దానికి ఆయన బద్దకం అనే సమాధానం ఇచ్చారు మన నంది. దీంతో నిద్రలో ఉన్నప్పుడు గెడ్డం గీసేయమనండి రమ గారిని అని సలహా ఇచ్చారు బాలయ్య. ‘దాన వీర శూర కర్ణ’ సినిమా షూటింగ్ సమయంలో తమకు అలానే చేసేవారని బాలయ్య ఆ సినిమా రోజుల్ని గుర్తు చేసుకున్నారు. సినిమా కోసం రాత్రి పొద్దుపోయేవరకు పని చేసి నిద్ర పోయేవాళ్లమని… సమయం చాలక రాత్రులు నిద్రలోనే గెడ్డం గీసేవారని చెప్పుకొచ్చారు బాలయ్య.