కొన్ని తెలుగు సినిమాల్లో డ్యాన్స్ మాస్టర్ ఫైట్స్ కంపోజ్ చేస్తుంటారు, ఫైట్ మాస్టర్లు పాటలకు డ్యాన్స్ కంపోజ్ చేస్తుంటారు. ఇదేంటి.. ఇలా కూడా జరుగుతుందా అనుకుంటున్నారా? దీనికి గతంలో రెండు, మూడు సార్లు ఆన్సర్ విన్నాం. రీసెంట్‌గా అయితే రాజమౌళి చెప్పారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా గురించి రాజమౌళి మాట్లాడుతూ ఈ ఆసక్తికరమైన విషయాన్ని చెప్పుకొచ్చారు. సినిమా కోసం ప్రస్తుతం రాజమౌళి విదేశాల్లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ విషయం చెప్పుకొచ్చారు.
‘ఆర్‌ఆర్ఆర్’ సినిమాలో ‘నాటు నాటు..’ పాట ఎంత హిట్ కొట్టిందో మనకు తెలిసిందే. ఆ పాటలో రామ్‌చరణ్, తారక్ కలసి సింక్‌లో వేసే స్టెప్పులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటే ఓ తెలియని ఆనందం కళ్లలో కనిపిస్తుంది అంటారు. ఆ సినిమాలో అదే స్థాయిలో గూస్‌బంప్స్ తీసుకొచ్చిన సీన్ అంటే.. షోల్డర్ ఫైట్. రామ్‌చరణ్‌ను భుజాలైన కూర్చోబెట్టుకుని ఎన్టీఆర్ ఫైట్ చేస్తాడు. సినిమాను ఓ లెవల్ హైకి తీసుకెళ్తుంది ఆ సీన్. ఆ పాటను, ఈ ఫైట్‌ను కంపోజ్ చేసింది ప్రేమ్‌రక్షిత్ మాస్టర్ అట.
ఈ విషయాన్ని రాజమౌళినే చెప్పారు. ‘‘తారక్, చరణ్ భుజం ఫైట్ సీక్వెన్స్‌ను ఓ డ్యాన్స్ మాస్టర్ డిజైన్ చేశారు. ‘నాటు నాటు…’ పాటను కొరియోగ్రఫీ చేసిన ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్.. ఈ షోల్డర్ ఫైట్‌నూ డిజైన్ చేశారు’’ అంటూ గొప్పగా చెప్పుకొచ్చారు రాజమౌళి. దీనికి సంబంధించిన వీడియోను ప్రేమ్‌రక్షిత్ మాస్టర్ సోషల్ మీడియాలో షేర్ చేసి.. థ్యాంక్యూ చెప్పుకొచ్చారు. ప్రేమ్ రక్షిత్ మాస్టర్‌తో పని చేయడం తనకు చాలా ఇష్టమని కూడా రాజమౌళి అన్నారు. అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో మూవీ మారథాన్‌లో రాజమౌళి వందలాది మంది అభిమానుల మధ్యలో చెప్పారు.
‘‘ప్రేమ్ రక్షిత్‌తో నాతో సినిమా చేసేటప్పుడు ఇతర ప్రాజెక్టులకు చేయరు. ‘నాటు నాటు..’ పాట స్టెప్స్ కోసం ఆయన టీమ్ చాలా కష్టపడ్డారు. ఆ స్టెప్స్ రిహార్సల్స్ చేస్తున్నప్పుడు కాళ్ల నొప్పులు వచ్చినా వాళ్లు కష్టపడి పని చేశారు. ‘నాటు నాటు..’ పాట కోసం మేం పదుల సంఖ్యలో షూట్ చేస్తే.. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ వంద సిగ్నేచర్ స్టెప్పులను కంపోజ్ చేసి చెక్ చేసుకున్నారు. అందులో ఆయన బెస్ట్ అనుకున్నవి తారక్, రామ్‌చరణ్‌తో చెప్పి చేయించారు. అవే ఇప్పుడు థియేటర్లలో అదిరిపోతున్నాయి అని చెప్పారు జక్కన్న.