ఎంత పెద్ద స్టార్ హీరోయినా సినిమా రిలీజ్ అవుతోంది అంటే.. ఆ సినిమా ఫలితం గురించి ఏదో ఆందోళన అయితే ఉంటుంది. అందులోనూ అంతకుముందు వచ్చిన సినిమా హిట్ కొడితే ఇంకా ఆందోళన ఉంటుంది. అదే ఆ సినిమా బ్లాక్‌బస్టర్ అయి ఉంటే ఇంకా ఎక్కువ ఆందోళన ఉంటుంది. ఇప్పుడు ఇదే పరిస్థితిలో ఉన్నాను అని ప్రముఖ కథానాయకుడు రజనీకాంత్ (Rajinikanth) చెప్పారు. తన కొత్త సినిమా ‘వేట్టయాన్’ (Vettaiyan) విడుదల సందర్భంగా అలా ఉన్నాను అని చెబుతున్నారు.
Rajinikanth
రజనీకాంత్ ప్రధాన పాత్రలో టి.జె.జ్ఞానవేల్ (T. J. Gnanavel) తెరకెక్కించిన చిత్రం ‘వేట్టయాన్’. ఈ సినిమాను అక్టోబర్ 10న పాన్ ఇండియా లెవల్‌లో విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చెన్నైలో సినిమా టీమ్ ఆడియో రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సంగీత దర్అకుడు అనిరుధ్‌తో కలసి రజనీ డ్యాన్స్ చేసి అలరించారు. ఈ క్రమంలో తన గత సినిమా ‘జైలర్’ ప్రభావం తన కొత్త సినిమా మీద ఎంతుంది అనేది కూడా చెప్పారు.
ఏదైనా సినిమా విజయం అందుకోకపోతే ఆ తర్వాత సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలనే టెన్షన్ ఉంటుంది. అలాగే ఒక సూపర్ హిట్ సినిమా తర్వాత వచ్చే ప్రాజెక్ట్‌కు దానికి మించిన విజయం అందాలనే టెన్షన్ ఉంటుంది. అలా తాను టెన్షన్‌లోనే ఉన్నానని చెప్పారు. ‘జైలర్’కు (Jailer) మంచి ప్రేక్షకాదరణ వచ్చిందని, ఈ సినిమాను కూడా అలానే ఆదరిస్తారని ఆశిస్తున్నానని తలైవా తెలిపారు.
సంగీత దర్శకుడు అనిరుధ్ (Anirudh Ravichander) తనకు కుమారుడితో సమానమని చెప్పిన రజనీకాంత్.. ఈ సినిమాకు మంచి సంగీతం అందించాడు అని తెలిపారు. సందేశాత్మక సినిమా చేయాలని ఉందని దర్శకుడు జ్ఞానవేల్‌ను అడిగానని… ఆయన వెంటనే ఈ కథతో ముందుకొచ్చారు అని రజనీ తెలిపారు. అలాగే సినిమా పూజా కార్యక్రమం జరిగిన రోజే అక్టోబర్ 10న విడుదల చేయాలని అనుకున్నామని, కానీ కొన్ని కారణాల వల్ల ఆగామని, కానీ ఇప్పుడు అదే రోజున విడుదల చేస్తున్నామని రజనీ చెప్పారు.