ప్రముఖ నటుడు, సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) అభిమానులకు ఆందోళన కలిగించే అంశం సోమవారం చోటు చేసుకుంది. తలైవా మరోసారి అనారోగ్యం పాలయ్యారని, ఆయన ఇప్పుడు ఆసుపత్రిలో ఉన్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఏమైంది, ఎందుకు ఆసుపత్రిలో చేరారు అంటూ వాకబు చేయడం మొదలుపెట్టారు అభిమానులు. ఈ క్రమంలో చెన్నైలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారని తేలింది. అయితే రజనీకాంత్ ఆరోగ్యం గురించి అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెన్నై అపోలో ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
Rajinikanth
సూపర్ స్టార్ తీవ్రమైన కడుపు నొప్పితో ఆసుపత్రికి వచ్చారని, ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. అలాగే రజనీ సతీమణి లతా రజనీకాంత్ కూడా తన భర్త ఆరోగ్య పరిస్థితి గురించి స్పందించారు. ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు. అభిమానులు, ప్రేక్షకులు ఎటువంటి అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని ఆమె చెప్పారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రజనీకాంత్‌కి వివిధ టెస్టులు చేసినట్లు సమాచారం.
వయసు ప్రభావం వల్ల ఏవైనా చిన్న సమస్యలు వస్తాయని.. అంతేకానీ అవి పెద్ద విషయంలా తీసుకోవద్దని సన్నిహితులు చెబుతున్నారు. మరోవైపు రజనీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ ‘వేట్టయన్’ (Vettaiyan) ఈ నెల 10న విడుదలవుతోంది. ‘జైలర్’ (Jailer) సినిమా తర్వాత రజనీ నుండి వస్తున్న సినిమా (సోలో హీరోగా) కావడంతో ‘వేట్టయాన్’ మీద భారీ అంచనాలు ఉన్నాయి. ‘జై భీమ్’ సినిమాతో అభిరుచి ఉన్న దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న జ్ఞానవేల్ (T. J. Gnanavel) ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
ఇక ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) , టాలీవుడ్ స్టార్ యాక్టర్ రానా (Rana), రితికా సింగ్ (Ritika Mohan Singh) , ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil) , మంజు వారియర్ (Manju Warrier) తదితరులు ఇతర కీలక పాత్రలు చేశారు. ఈ సినిమా తర్వాత లోకేశ్ కనగరాజు (Lokesh Kanagaraj) ‘కూలీ’ (Coolie) సినిమా పనులు రజనీ వేగవంతం చేస్తారని వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు కాస్త అనారోగ్యానికి గురవ్వడంతో ఆ సినిమా ఆలస్యం అవ్వొచ్చు అని తెలుస్తోంది.