సూపర్ స్టార్ రజినీకాంత్ ‘అన్నాత్తే’ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ కి వచ్చారు. షూటింగ్ సమయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. షూటింగ్ లో ఆరుగురికి కరోనా సోకింది. దీంతో షూటింగ్ కి బ్రేక్ పడింది. ఆ తరువాత రజినీకాంత్ అండ్ టీమ్ కి కరోనా పరీక్షలు నిర్వహించి హోమ్ క్వారెంటైన్ లో ఉంచారు. డిసెంబర్ 22న రజినీకాంత్ కి టెస్ట్ లు చేయగా.. కరోనా నెగెటివ్ అని తేలింది. అయితే ఇప్పుడు ఆయనకి బీపీ పెరిగిపోవడంతో వెంటనే జూబ్లీహిల్స్ లోని అపోలో హాస్పిటల్ లో జాయిన్ చేశారు.
ఈ మేరకు అపోలో యాజమాన్యం రజినీకాంత్ హెల్త్ స్టేటస్ పై బులిటెన్ విడుదల చేసింది. రజినీకి కరోనా నెగెటివ్ వచ్చిందనీ.. కానీ హైబీపీ కారణంగా ఆయన్ని హాస్పిటల్ లో జాయిన్ చేశారని.. ఇతర ఆరోగ్య సమస్యలేవీ లేవని పేర్కొంది. బీపీ కంట్రోల్ అయినంత వరకు హాస్పిటల్ లోనే ఉంచి ఆ తరువాత డిశ్చార్జ్ చేస్తామని వెల్లడించారు. అయితే రజినీకాంత్ కరోనాతోనే హాస్పిటల్ లో జాయిన్ అయ్యారంటూ పలు కథనాలు రావడంతో ఆయన అభిమానుల్లో ఆందోళన పెరిగిపోయింది.
ఇప్పుడు హాస్పిటల్ యాజమాన్యం రజినీ ఆరోగ్యంపై క్లారిటీ ఇవ్వడంతో పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది. ఇటీవల రజినీకాంత్ తమిళనాట కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించారు. జనవరిలో పార్టీ పేరు, విధివిధానాలను ప్రకటించడానికి ప్రణాళికలు రూపొందించారు. అలాంటిది ఆయన ఇప్పుడు ఆయన ఆరోగ్యం పాడవ్వడంతో అభిమానులు టెన్షన్ పడుతున్నారు. త్వరగా కోలుకోవాలంటూ కోరుకుంటున్నారు.