కుర్ర స్టార్ హీరోలే.. ఏడాదికి ఒకటి, ఒకసారి ఒకటే అనే కాన్సెప్ట్‌తో సినిమాలు చేస్తున్న ఈ రోజుల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ ఒకేసారి రెండు సినిమాలు ఓకే చేసేసి, స్టార్ట్ చేసే పనిలో ఉన్నారు. ‘జైలర్’ సినిమా తర్వాత రజనీకాంత్ ఆ రెండు చిత్రాలు చేస్తారని ఇటీవల అధికారికంగా ప్రకటించారు కూడా. ఈ రెండింటినీ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. అయితే అంతకుమించి వివరాలేవీ ప్రకటించలేదు. అయితే ఆ రెండింటిలో ఓ సినిమాకు రజనీకాంత్ తనయ దర్శకత్వం వహిస్తారని కోడంబాక్కం టాక్.
లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఆ రెండు సినిమాలకు సంబంధించి అదనపు వివరాలు ప్రకటించనప్పటికీ.. కోలీవుడ్ సమాచారం ప్రకారం చూస్తే.. ఓ సినిమాకు రజనీ పెద్ద కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. ఐశ్వర్య చెప్పిన కథ రజనీకాంత్‌కి నచ్చిందట. దాంతోపాటు లైకా సంస్థకు ఓకే అనుకోవడంతో.. సినిమా పట్టాలెక్కనుందని తెలుస్తోంది. త్వరలో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందని అంటున్నారు. దీంతో అభిమానుల్లో ఆసక్తి ఏర్పడింది. దీని వెనుక ఓ చేదు సినిమా కూడా ఉందని మరచిపోకూడదు.
గతంలో రజనీ తన చిన్న కూతురు సౌందర్య దర్శకత్వంలో ‘కొచ్చడయాన్’ అనే సినిమాలో నటించారు. మోషన్ క్యాప్చర్ విధానంలో తెరకెక్కించిన ఆ సినిమా పెద్ద ఎత్తున విమర్శల పాలయ్యింది. తలైవాని అలా బొమ్మలా చూపించడం ఏంటి అని అభిమానులే విమర్శించారు. దానికి బదులు నేరుగా ఆ కథను రజనీ మీద తీసి ఉంటే.. భారీ విజయం పక్కా అని చెప్పారు. ఈ నేపథ్యంలో రజనీకాంత్ మరో కూతురు తీస్తున్న ఈ సినిమా ఎలా ఉండబోతోంది అని లెక్కలేస్తున్నారు.
ఐశ్వర్య ఇప్పటివరకు రెండు సినిమాలు తెరకెక్కించారు. ‘ధనుష్’తో ‘3’ అనే సినిమా చేశాడు. ఈ సినిమాకు ఆర్థికంగా విజయం దక్కకపోయినా.. మంచి దర్శకురాలు అనే పేరు సంపాదించుకున్నారు. ఆ తర్వాత ‘వేయ్ రాజ్ వేయ్’ అనే సినిమా చేశారు. ఇది కూడా ఇంచుమించు ఇంతే. ఇప్పుడు రజనీకాంత్ లాంటి పెద్ద స్టార్‌ను ఎలా హ్యాండిల్ చేస్తారు అనేది చూడాలి.