టాలీవుడ్‌లో ఉన్న ఫుడీ ఫ్యామిలీల్లో మెగా ఫ్యామిలీ ఒకటి. ఆహారం విషయంలో ఆ కుటుంబం ఎంత ప్రేమగా ఉంటారో ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో మెగా కోడలు ఉపాసన కామినేని చెప్పారు. ఫుడ్ విషయంలో కొణిదెల కుటుంబం పాటించే ఆచారాలు, అలవాట్లు, కాంబినేషన్లు, ప్రత్యేక వంటకాల గురించి వివరంగా చెప్పారు. అలాంటి ఇంటికి ప్రముఖ చెఫ్ ఒసావా టకమసా వెళ్లారు. వెళ్లి ఏదో జపనీస్ట్ స్టైల్ ఫుడ్ చేశారు అనుకునేరు. అథెంటిక్ హైదరాబాద్ బిర్యానీ వండి వార్చారట. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రామ్‌చరణ్ తన కుటుంబంతో కలిసి కుండ బిర్యానీ రుచిని ఆస్వాదించారు. 15 ఏళ్లుగా బిర్యానీ వండటంలో ఆరితేరిన ఒసావా టకమసా దీనిని సిద్ధం చేశారు. ఆయన సింగిల్ పాట్ బిర్యానీ వండాడంటే హండీ క్షణాల్లో ఖాళీ అవుతుంది అనే రెప్యుటేషన్ ఉంది ఆయనకు. గత కొద్ది రోజులు ‘పెద్ది’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న రామ్‌చరణ్ కాస్త విరామం ఇచ్చారు. ఆయనకే అనిపించిందో లేక గర్భిణిగా ఉన్న ఉపాసన అడిగారో కానీ ఒసావాతో స్పెషల్ బిర్యానీ చేయించుకుని తిని ఎంజాయ్ చేశారు.

ఒసావా సాంప్రదాయ పద్ధతిలో ఆరుబయట కట్టెల పొయ్యిపై బిర్యానీ వండాడని సమాచారం. తక్కువ గ్రేవీతో బిర్యానీ వండిన విధానం, సువాసన అద్భుతంగా ఉందని చరణ్ ఆయనకు కితాబిచ్చారు కూడా. చరణ్‌తో పాటు, ఆయన తల్లి సురేఖ, సతీమణి ఉపాసన, ఇతర కుటుంబ సభ్యులు ఒసావా బిర్యానీ రుచి చూశారు. ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే బుచ్చిబాబు దర్శకత్వంలో ‘పెద్ది’లో నటిస్తున్నారు. జాన్వీకపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా మార్చి 27న విడుదల కానుంది.
ఈ సినిమా నుండి ఇటీవల వచ్చిన ‘చికిరి చికిరి’ సాంగ్ ప్రేక్షకులను ఇప్పటికీ అలరిస్తూనే ఉంది. సంక్రాంతి తర్వాత ఈ సినిమా నుండి మరోపాట రిలీజ్ కానుందట. ఆ పాట దీనిని మించి ఉంటుంది అని టీమ్ చెబుతోంది.
