మాస్ ప్రేక్షకులకు అసలైన విందు అందించే బోయపాటి శ్రీను దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా చేస్తున్నట్లు తెలియగానే మెగా ఫ్యాన్స్ ఆనందపడ్డారు. ప్రీ ప్రొడక్షన్ వేగంగా సాగుతుండడంతో సంతోషపడ్డారు. కానీ వారికీ ఓ చేదు వార్త. ఈ సినిమా ఆగిపోయినట్లు పరిశ్రమవర్గాలు తెలిపాయి. కారణం ఏమిటని ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. ఈ కథలో హీరో “రాజవంశస్థుడు”గా ఉంటాడు. అందుకే రాజస్థాన్ లో రాజా మహల్ ని షూటింగ్ కోసం లీజుకు తీసుకున్నారు. అక్కడే దాదాపు 70 శాతం షూట్ చేయాలనుకున్నారు. కానీ అది కుదిరేలా లేదు. ఎందుకంటే ఈ చిత్ర కథ బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన “ప్రేమ్ రతన్ దన్ పాయో” సినిమా కథకి చాలా దగ్గరగా ఉంటుంది. ఇందులో యాక్షన్ సీన్స్ కంటే సెంటిమెంట్ సీన్స్ ఎక్కువగా ఉంటాయి.
అదే విధంగా చరణ్ కథ ని రాసుకున్నట్లు తెలిసింది. సెంటిమెంట్ సీన్స్ తగ్గించమని డైరక్టర్ ని చరణ్ కోరగా.. అందుకు ఒప్పుకోలేదంట. అందుకే ఈ సినిమా చేయనని చరణ్ స్పష్టం చేసినట్లు వార్త ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతోంది. గతంలోను రామ్ చరణ్ “మెరుపు” సినిమాను మొదలెట్టి ఆపేశారు. ఇప్పుడు బోయపాటి తో చిత్రాన్ని క్యాన్సిల్ చేసుకున్నారు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ రంగస్థలం సినిమాని చేస్తున్నారు. రెండు పాటలు మాత్రమే మిగిలి ఉన్న ఈ చిత్రం మార్చిలో థియేటర్ లోకి రానుంది. దీని తర్వాత బోయపాటి సినిమా మొదలెడుతారా? నేరుగా రాజమౌళి సినిమా చేస్తారా? అనేది.. త్వరలోనే తెలియనుంది.