ఫిన్లాండ్ వేదికగా జరిగిన ఐఏఏఎఫ్ వరల్డ్ అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో అస్సాంకి చెందిన హిమ దాస్ (18 ) అద్భుత ప్రదర్శన కనబర్చింది. 400మీ పరుగుని కేవలం 51.46 సెకన్లలోనే పూర్తి చేసి సరికొత్త రికార్డులు నెలకొల్పింది. ఐఏఏఎఫ్ ప్రపంచ అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో స్వర్ణం గెలిచిన భారత తొలి మహిళా అథ్లెట్‌గా హిమ దాస్ చరిత్ర సృష్టించింది. ఈ ఛాంపియన్‌షిప్‌లో ఓ భారత అథ్లెట్ ట్రాక్ ఈవెంట్‌లో బంగారు పతకం గెలుపొందడం ఇదే తొలిసారి. ఈ అరుదైన ఘనతను సాధించిన హిమ దాస్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్‌చరణ్, మహేష్ బాబు కూడా హిమదాస్‌కు అభినందనలు తెలియజేశారు.
“హిమదాస్‌కు సెల్యూట్! మీరు దేశాన్ని గర్వపడేలా చేశారు. దేశం యావత్తు మీకు సెల్యూట్ చేస్తోంది” అంటూ తన ఫేస్‌బుక్ ఖాతాలో రామ్‌చరణ్ పోస్ట్ చేశారు. “హిమ దాస్ అద్భుత ప్రతిభ కనబరిచింది. భారత క్రీడారంగంలోనే అత్యంత అరుదైన విజయాల్లో ఇదొకటి. చాలా గర్వంగా ఉంది. సంతోషంగా ఉంది” అని మహేష్.. హిమదాస్ కి ట్విట్టర్ వేదికపై కంగ్రాట్స్ చెప్పారు. “కొత్త చరిత్ర సృష్టించిన హిమదాస్‌కు హృదయపూర్వక అభినందనలు. ఇది సంతోషకర సమయం” అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. వీరితో పాటు బాలీవుడ్ సినిమా స్టార్లు, నేతలు శుభాకాంక్షలు చెప్పారు.