మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ కు ఇది నిజంగా కిక్కిచ్చే వార్త. ‘గేమ్ ఛేంజర్’ ఫలితాన్ని పక్కన పెట్టి, ఇప్పుడు ‘పెద్ది’తో గట్టిగా కొట్టాలని చరణ్ డిసైడ్ అయ్యారు. బుచ్చిబాబు సానా డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ సైలెంట్ గా, జెట్ స్పీడ్ లో పూర్తయిపోతోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తవడానికి దగ్గర్లో ఉంది. ఇక మిగిలింది సినిమాకు ప్రాణంగా నిలిచే మూడు ప్రధాన ఘట్టాలు మాత్రమేనట.
అవును, సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే.. ఇక బ్యాలెన్స్ ఉన్న ఆ మూడు ఎపిసోడ్స్ మరో ఎత్తు. గూస్ బంప్స్ తెప్పించే భారీ కుస్తీ సీక్వెన్స్, కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ క్లైమాక్స్, ఆడియెన్స్ ను ఉర్రూతలూగించే ఒక స్పెషల్ ఐటెం సాంగ్.. ఈ మూడే పెండింగ్ ఉన్నాయట. ఈ మూడింటిని పూర్తి చేస్తే దాదాపు గుమ్మడికాయ కొట్టేసినట్లే. అంటే అవుట్ పుట్ విషయంలో టీమ్ ఎంత క్లారిటీగా, ఎంత ఫాస్ట్ గా వెళ్తుందో అర్థం చేసుకోవచ్చు.
దీనికోసం షెడ్యూల్స్ కూడా పక్కాగా ప్లాన్ చేశారు. రేపటి నుంచే హైదరాబాద్ లోని వన్ స్టూడియో, కోఠి ఆసుపత్రి పరిసరాల్లో షూటింగ్ జరగనుంది. అక్కడ పని పూర్తి కాగానే, ఈ నెల 18 నుంచి టీమ్ ఢిల్లీకి షిఫ్ట్ అవుతుంది. అక్కడ నాలుగు రోజుల పాటు కొన్ని రియలిస్టిక్ సీన్స్, మాంటేజ్ షాట్స్ తీయనున్నారు. ఈ షెడ్యూల్స్ తో మేజర్ పార్ట్ షూటింగ్ ఒక కొలిక్కి వచ్చేస్తుంది.
అసలు రిలీజ్ డేట్ 2026 మార్చి 27 కదా, ఇంకా చాలా టైమ్ ఉంది కదా అని అనుకోవచ్చు. కానీ ఈ సినిమాకు విజువల్ ఎఫెక్ట్స్, పోస్ట్ ప్రొడక్షన్ చాలా కీలకం. అందుకే షూటింగ్ ను సాధ్యమైనంత త్వరగా ముగించేసి, ఆ తర్వాత గ్రాఫిక్స్ మీద కూర్చోవాలని బుచ్చిబాబు ప్లాన్. ఇప్పటికే ‘చికిరి చికిరి’ సాంగ్ పాజిటివ్ వైబ్ ను కంటిన్యూ చేస్తూ, ఎక్కడా బ్రేక్ లేకుండా పని కానిచ్చేస్తున్నారు. ఢిల్లీ షెడ్యూల్, ఆ తర్వాత పెండింగ్ ఉన్న ఆ మూడు కీ సీన్స్ పూర్తయితే.. ఇక ప్రమోషన్ల జాతర మొదలైనట్లే. బాక్సాఫీస్ దగ్గర చరణ్ ఊచకోత ఎలా ఉంటుందో చూడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
